AP Elections: బరిలోకి గెలుపు గుర్రాలు.. ప్రజలు ఆదరించేదెవరిని..?
ABN, Publish Date - Mar 29 , 2024 | 07:30 PM
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి.. గెలపు గుర్రాలను బరిలో దించాయి. ఎన్నికల యుద్ధంలో గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ (YCP) వ్యూహాలు సిద్ధం చేశాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి.. గెలపు గుర్రాలను బరిలో దించాయి. ఎన్నికల యుద్ధంలో గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ (YCP) వ్యూహాలు సిద్ధం చేశాయి. 175 శాసనసభ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 88 స్థానాల్లో గెలుపొందాలి. వైసీపీ 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీ(TDP) 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలో పోటీ చేయబోతున్నాయి. వైసీపీతో పాటు.. టీడీపీ, బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన అధికారికంగా 18 మంది అభ్యర్థులను ప్రకటించగా.. మూడు స్థానాల్లో ప్రకటించాల్సి ఉంది. పూర్తిస్థాయి కసరత్తు, సర్వేలు, సమీక్షల తర్వాత.. పార్టీలు గెలుపు గుర్రాలను ఎంపిక చేసింది. బరిలో గెలుపు కోసం అభ్యర్థులు తలపడుతున్నారు. అయితే ఈ 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు.. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
Chandrababu Naidu: చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు కామెంట్స్..
2019లో వైసీపీకి..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఏపీ ఓటర్లు ఆదరించారు. దీంతో 151 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తానంటూ జగన్ ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారు. కాని ఐదేళ్ల పాలనలో జగన్ ఇచ్చిన హామీ అమలు చేయడంలో విఫలమయ్యారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రధాన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. మద్యపాన నిషేదంతో మహిళలను ఆకర్షించిన జగన్.. మద్యం ధరలు పెంచి.. వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించేందుకు యువతను సేల్స్ ఎగ్జిక్యూటివ్, సూపర్ వైజర్లుగా నియమించారు. ఎన్నికల ముందు యువతకు ఉద్యోగాలిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడంపై చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. మద్యపాన నిషేదాన్ని చేయకపోగా.. ధరలు పెంచడం ద్వారా ఇంటి యజమాని రోజు వారీ సంపాదించే మొత్తంలో గతం కంటే ఎక్కువ మద్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో మహిళలు సైతం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.
మరోవైపు ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ఇచ్చిన హామీని జగన్ అమలు చేయలేదు. దీంతో ఉద్యోగులు సైతం వైసీపీ ప్రభుత్వంపై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉండటంతో ఎలాంటి అభ్యర్థులను బరిలో దింపినా ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఓటర్లు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు రూపంలో చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. వారికే టికెట్లు కేటాయించడం వైసీపీకి మైనస్‌గా మారనుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
కూటమి తరపున..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విషయంలో తీవ్ర కసరత్తు చేసింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 144 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. సామాజిక సమీకరణలతో పాటు.. యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించింది. తెలుగుదేశం అభ్యర్థుల్లో విద్యాధికులు ఎక్కువుగా ఉన్నారు. ఉన్నత విద్యావంతులు సైతం ఉండటంతో.. ఈసారి ప్రజలు కూటమి వైపు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం పల్లెల్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు పాలన చూసిన నాయకులు.. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం అవసరమని ఓటర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని, మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం మరింత వెనుకబాటుకు గురవడంతో పాటు.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందనే ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో వైసీపీ, టీడీపీ తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించినా.. విజయవకాశాలు మాత్రం కూటమికే ఉన్నాయన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాలతో పాటు మొత్తంగా ఓ ఇరవై నుంచి 30 స్థానాల్లో మాత్రం వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటరు నాడి తెలవాలంటే జూన్4 వరకు వెయిట్ చేయాల్సిందే.
TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 29 , 2024 | 07:30 PM