Share News

గూగుల్‌.. గేమ్‌ చేంజర్‌!

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:18 AM

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వచ్చిన తర్వాతే అక్కడ సాఫ్ట్‌వేర్‌ ముఖ చిత్రం మారిపోయింది.

గూగుల్‌.. గేమ్‌ చేంజర్‌!

విశాఖలో డేటా సెంటర్‌.. స్థలం అన్వేషణలో గూగుల్‌ బృందం

విశాఖపట్నం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వచ్చిన తర్వాతే అక్కడ సాఫ్ట్‌వేర్‌ ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు... విశాఖకు గూగుల్‌ రాక ‘గేమ్‌ చేంజర్‌’ కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందంతో ఈ దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల పెట్టుబడుల సేకరణకు విదేశీ పర్యటన చేసినప్పుడు గూగుల్‌ ప్రతినిధులతో చర్చించారు. ఈ నెల 6వ తేదీన విశాఖలో నిర్వహించిన డీప్‌ టెక్నాలజీ సదస్సులో దీనిపై ఒప్పందం జరిగింది. అప్పుడే గూగుల్‌ బృందం విశాఖపట్నం అంతా తిరిగి అనువైన స్థలం కోసం అన్వేషణ చేపట్టింది. ఇంటర్‌నెట్‌కు గుండెకాయ వంటి కేబుల్‌ లైన్లను సింగపూర్‌ నుంచి సముద్ర గర్భంలో (అండర్‌ సీ) విశాఖపట్నం వరకూ తీసుకొస్తారు. కేబుల్‌ ల్యాండ్‌ అయిన చోట ఇది శక్తిమంతంగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ డేటా సెంటర్‌ పెట్టడానికి అప్పుడు అదానీ, ఇప్పుడు గూగుల్‌ ముందుకొచ్చాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న డీప్‌ టెక్నాలజీస్‌ అన్నింటిలో గూగుల్‌ సహకరిస్తుంది. గూగుల్‌తో రెండు దశాబ్దాల కిందటే ఒప్పందం చేసుకుని... ఆ సంస్థతో కలిసి పని చేసిన కంపెనీ విశాఖపట్నంలోనే ఉండడం విశేషం. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో గూగుల్‌ ఏర్పాటుకు విశాఖకు చెందిన ప్రవాసాంధ్రుడు కాట్రగడ్డ లలితేశ్వర్‌ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో లలితేశ్వర్‌ సమీప బంధువు, ‘సింబియోసిస్‌’ నరేశ్‌కుమార్‌ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. గూగుల్‌ రాక విశాఖకు వరమని, దీని ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నరేశ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

Updated Date - Dec 12 , 2024 | 03:19 AM