ACB Raids: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఫోకస్!
ABN, Publish Date - Aug 25 , 2024 | 10:41 AM
వైసీపీ ప్రభుత్వంలో పలు శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, వారికి అధికారులు వంతపాడారని విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలనూ ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపడుతోంది.
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలు శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, వారికి అధికారులు వంతపాడారని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని శాఖలనూ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది.
కీలకంగా ఉన్న మైనింగ్ శాఖ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మైనింగ్ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏసీబీని రంగంలోకి దింపి అవినీతి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోనుందని సమాచారం.
తాజాగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మైనింగ్ కార్యాలయాలు అన్నింటిలో రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నిన్న(శనివారం) మధ్యాహ్నం నుంచి రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) కూడా అధికారులు పలు రికార్డులను పరిశీలించారు.
కొన్ని కార్యాలయాల నుంచి కీలక రికార్టులను తెప్పించుకుని వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరికొన్ని రికార్డులను సీజ్ చేసి ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు. 2021 నుంచి ఉన్న రికార్టులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జేపీ వెంచర్స్ కాంటాక్ట్‌లు, తవ్వకాలు, చెల్లింపులపై ప్రధానంగా దృష్టి సారించారు. కొంతమంది అధికారులను రేపు (సోమవారం) ఏసీబీ కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
వైసీపీతో అంటకాగిన, వెంకటరెడ్డి చెప్పిందల్లా చేసిన అధికారులపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, పరారీలో ఉన్న వెంకటరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేసిన కొంతమంది పాత్రపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.
Updated Date - Aug 25 , 2024 | 11:06 AM