Anagani Satya Prasad: రెడ్ బుక్ చూస్తుంటే జగన్ వెన్నులో వణుకు.. మంత్రి అనగాని విసుర్లు
ABN, Publish Date - Jul 26 , 2024 | 08:43 PM
అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) పోల్చుకుంటే గోబెల్స్ కూడా సరిపోడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు.
అమరావతి: అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) పోల్చుకుంటే గోబెల్స్ కూడా సరిపోడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు. రాజకీయ హత్యల వివరాలు వెల్లడించే ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. రెడ్ బుక్ చూస్తుంటే జగన్ వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు.
తన పాపాలకు శిక్ష తప్పదని తెలిసే సానుభూతి కోసం కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్వేత పత్రాల ద్వారా జగన్ బండారం బట్టబయలు అవుతుందని చెప్పారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బాగా తెలిసిన విద్య అయిన ఫేక్ ప్రచారాన్ని జగన్ నమ్ముకున్నారని విమర్శించారు. జనం ఛీ కొడుతున్నా సిగ్గు లేకుండా నవ్వుతూ అబద్దాలు చెప్పడం ఆయన అలవాటుగా చేసుకున్నారని సెటైర్లు గుప్పించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడం జగన్‌కు మాత్రమే చెల్లిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆక్షేపించారు.
జగన్ ఆ విషయం గ్రహించాలి: పయ్యావుల కేశవ్
మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లు అయినా సమయం పడుతుందని విమర్శించారు. ప్రజలు జగన్‌కు ఓట్లేసి 11సీట్లయినా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమని కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్మీట్‌లు పెట్టడానికి కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... అభిమానించినా, అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయంగా ఉండగలరని జగన్ గ్రహించాలని అన్నారు.
జగన్ ఇలాగే పోతే ఉన్న 11మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని అన్నారు. శ్వేతపత్రంలో చూపిన రూ.9.30 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని తెలిపారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా జగన్ చెప్పొచ్చు కదా? అని అడిగారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని విమర్శించారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగాతానంటున్నారని ఎద్దేవా చేశారు. కనీసం 30మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవారని చెప్పారు. రాష్ట్రంలో ఈ నిమిషం వరకూ జగన్ ప్రభుత్వంలో పోస్టింగ్‌లో వచ్చినా ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలుగా ఉన్న విషయం గ్రహించాలన్నారు. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
Updated Date - Jul 26 , 2024 | 10:45 PM