Delhi Tour: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ..
ABN, Publish Date - Oct 07 , 2024 | 05:27 PM
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అందజేశారు.
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అందజేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకుని ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదట విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశం అయ్యారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రితో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, వైజాగ్ రైల్వే జోన్‌పై కూలంకశంగా చర్చించారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రితో ఫలవంతమైన సమావేశం జరిగినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని మోదీకి వివరించినట్లు చెప్పారు. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి పరిష్కరించడంలో, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. రాజధాని అమరావతికి మోదీ ఇస్తున్న మద్దతును అభినందిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Updated Date - Oct 07 , 2024 | 09:17 PM