CPI Ramakrishna: అందులో ఏపీకి తీరని అన్యాయం.. కేంద్రప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విసుర్లు
ABN, Publish Date - Nov 17 , 2024 | 11:51 AM
కేంద్రప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర చర్యల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఆరోపించారు.
విజయవాడ: ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరగబోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే... మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.ఎత్తు తగ్గిస్తే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే రూ.25 వేల కోట్లు కేంద్రానికి ఆదా అవుతుందని తెలిపారు. ఎడుమ కాల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారని, నిధులు ఆదా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని రామకృష్ణ మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదని, కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ మొదటి కేటాయింపులు చేసిందన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా కేటాయింపులు తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపైన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. పారదర్శకంగా చర్చ జరగాలని సూచించారు. ప్రాజెక్టులపై, నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని రామకృష్ణ అన్నారు.
నవంబర్ 18వ తేదీన నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలపై భారాలు వేయబోమని చెప్పారని.. కానీ ఇప్పుడు విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 19వ తేదీ నుంచి విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో పౌర సరఫరాల శాఖ మంత్రి విఫలమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు ఖాతరు చేసే వారే లేరని అన్నారు. డిసెంబర్ నుంచి ధరలపై ఉద్యమాలు చేపడతామని సీపీఐ రామకృష్ణ హెచ్చరించారు.
Updated Date - Nov 17 , 2024 | 11:57 AM