Lanka Dinakar: రంగంలోకి సిట్.. వారి ఆట కట్టిస్తాం.. లంకా దినకర్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Dec 09 , 2024 | 01:56 PM
పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్ అనే పరిస్థితికి వచ్చారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం కావడం బాధాకరమని తెలిపారు.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన “ సిట్’’ పేదల బియ్యం దోపిడీ ముఠా ఆట కట్టిస్తుందని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు, సక్రమమైన ఎగుమతులు - దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకొవాలని అన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని లెక్కలు చెబుతున్నాయన్నారు.
పేదల బియ్యం దోపిడీ పైన “సిట్“ అనగానే కలుగులో ఉన్న అవినీతిపరులు స్టాండ్, అటెన్షన్ అండ్ రన్ అనే పరిస్థితికి వచ్చారని చెప్పారు..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను ఆపడం వెనక ఉన్న స్ఫూర్తి ముఖ్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కేవలం పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం కావడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం దాదాపు రూ.10 వేల కోట్లు కేంద్రానికి, రూ.6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయం అవుతుందని అన్నారు.
అవినీతిపరులకు ఆదాయ మార్గం..
‘‘గడచిన ఐదేళ్లలో మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అయ్యింది. 2019 - 24 మధ్య పేదలకు అందాల్సిన రూ.80 వేల కోట్ల ఉచిత బియ్యంలో సింహ భాగం అవినీతిపరులకు ఆదాయ మార్గంగా మారింది. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యం దోపిడీతో వారి కడుపు కొట్టి జేబులు నింపుకోవాలని చూస్తున్నారు. అర్హులైన పేదల ఆకలి తీరేవిధంగా బియ్యం పంపిణీలో సంస్కరణలు సూచించాల్సిన అవసరం ఉంది. పేదలకు పట్టెడు అన్నం పెట్టడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావురూ. 2/- కిలో బియ్యం పథకం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారు. దీనికి అదనంగా జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఇచ్చే బియ్యం అదనం. గత మూడు సంవత్సరాలుగా స్థిరమైన వాస్తవిక సమాచారంతోనే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నాం. 10 అక్టోబర్ 2024న సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులను ప్రభుత్వ ఉచిత బియ్యం సమీక్ష కోసం సమాచారాన్ని అడగాం. బియ్యం దోపిడీ పైన సమాచార హక్కు చట్టం ద్వారా జూలై 2022లో మొదలైంది. 11 నవంబర్ 2022న లభించిన పూర్తి సమాచారంతో మొదటిసారి స్థానిక, జాతీయ మీడియా ద్వారా బియ్యం దోపిడీ పైన మేము వివరాలు ఇవ్వడం జరిగింది. పలు సందర్భాల్లో బియ్యం అవినీతి పైన ప్రశ్నిస్తూనే టీడీపీ జాతీయ కార్యాలయంలో 22 ఏప్రిల్ 2024న కూటమి నాయకుల బియ్యం దోపిడీ లెక్కలతో సహా వివరించాం.15 అక్టోబర్ 2024 న సివిల్ సప్లై అధికారులతో చర్చించినప్పుడు చాలా సంస్కరణలు ప్రస్తావనకు వచ్చాయి’’ అని లంకా దినకర్ తెలిపారు.
ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం...
1) 2019 - 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం దాదాపు రూ. 30,000 కోట్లు : 59,08,146 రేషన్ కార్డులకు గాను 1,63,51,364 మంది లబ్ధిదారులు.
2) 2019 - 24 మధ్య కేంద్ర ప్రభుత్వం దాదావు చేసిన వ్యయం రూ. 49,200 కోట్లు : 89,35,525 కార్డులకు గాను 2,68,30,006 మంది లబ్ధిదారులు.
3) మొత్తం రేషన్ కార్డులు : 1,48,43,671 అయితే లబ్ధిదారుల సంఖ్య 4,31,81,370 - మొత్తం వ్యయం రూ. 79,200 కోట్లు
4) 2019 - 24 మధ్య సివిల్ సప్లై కార్పొరేషన్ చేసిన అదనపు అప్పులు : 20,931 కోట్లు.
5) కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, ఎఫ్సీఐ నుంచి వచ్చే ఆదాయం, రాష్ట్ర బడ్జెట్ ఆదాయం మళ్లింపు ద్వారా సివిల్ సప్లైస్ రుణాల పైన వడ్డీలు, అసలు వాయిదాలు కడుతున్నారు.
చట్టపరంగా చర్యలు
‘‘రేషన్ కార్డు ద్వారా ఉచిత బియ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించే విధానాన్ని “ డీ లింక్ “ చేయాలి. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహారభద్రత చట్టం క్రింద ఉచిత బియ్యం లబ్ధిదారులు 4.32 కోట్ల మందిలో దాదాపు 62శాతం మంది ఉండగా, మరో 38 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వివిధ రాష్ట్రాల మొత్తం జనాభా - మొత్తం ఉచిత బియ్యం/గోధుమల రేషన్ కార్డుల లబ్ధిదారుల నిష్పత్తి పరిశీలన అవసరం. పూర్తి స్థాయి అధ్యయన అనంతరం అర్హులైన పేదలకు బియ్యం పంపిణీ అందేవిధంగా సంస్కరణల పైన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సిట్ నివేదిక అందిన అనంతరం పేదల బియ్యం రీసైక్లింగ్ చేసి అవినీతి చేసిన వారిపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది’’ అని లంకా దినకర్ తెలిపారు.
Updated Date - Dec 09 , 2024 | 01:56 PM