AP NEWS: ఏపీ విభజన అంశాలపై కీలక చర్చ.. ఎంపీలు ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 24 , 2024 | 02:25 PM
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
ఢిల్లీ: అదానీ వ్యవహారంలో ఏపీ ప్రస్తావన రావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇలాంటి సంఘటనలకు కారకులైన వారిని సమర్ధించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పార్లమెంట్ అనెక్స్‌లో ఇవాళ(ఆదివారం) ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది. పలు కీలక అంశాలపై ఈ సభలో చర్చించారు. సభలో చర్చించిన పలు అంశాలను లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వెల్లడించారు. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరానని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు. విభజన హామీల్లో కొన్ని సంస్థలకు శాశ్వత కట్టడాలు వచ్చాయి. కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని సంస్థలు ఏర్పాటు కావాలని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
విజయవాడలో వరద భీభత్సం నేపథ్యంలో, దేశంలో పలు నగరాలు, పట్టణాలను ముంచెత్తుతున్న వరదలు, ప్రకృతి వైపరీత్యాలపై పార్లమెంటులో విపులంగా చర్చ జరగాలని కోరానని అన్నారు. నదుల అనుసంధానంపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో ఏపీలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో జరిగే నదుల అనుసంధానం దేశానికే ఆదర్శం, స్పూర్తిదాయకం కావాలని చెప్పారు. ఆచార్య రంగా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో, కౌలు రైతుల ఈతిబాధలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను కూడా సమగ్ర చర్చించాలని చెప్పారు. సోషల్ మీడియా విశృంఖలత్వం పై చర్చతో పాటు, కట్టడి చేసేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. “వక్ఫ్” పై చర్చ పూర్తి కాలేదు. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ముస్లింల అభీష్టం మేరకు, బిల్లు రూపకల్పన జరగాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరిని సమర్థించకూడదో తెలుసుకోవాలి, గ్రహించాలని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలి..
‘‘అఖిలపక్ష సమావేశంలో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజయవాడ వరదల నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాల గురించి చర్చించాలని కోరాను. సోషల్ మీడియా అబ్యూజ్ గురించి పార్లమెంటులో చర్చించి, దాన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాలని కోరాను. ముస్లిం మైనారిటీల అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే సూచించాం. ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనకార్యాలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన చోట, అపకీర్తి మూటగట్టుకునే అంశాలపై రాష్ట్రం పేరు బయటికి రావడం బాధాకరం’’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
విభజన సమస్యలపై లోక్‌సభలో చర్చించాం: బాలశౌరి
అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించామని లోక్‌సభ జనసేన ఫ్లోర్ లీడర్ బాలశౌరి తెలిపారు. విభజన సమస్యలను వేగంగా పరిష్కరించాలని ప్రస్తావించానని అన్నారు. విభజన హామీల మేరకు, ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్ ప్లాంట్. ఓడ రేవు కూడా ఏపీకి ఇవ్వాలని కోరానని చెప్పారు. పోలవరం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. పునరావాసం కల్పించి రెండేళ్లలోనే నిర్మాణం పూర్తవ్వాలని అన్నారు. పోలవరం ఎత్తును తగ్గించకుండా ప్రజల కోరుకుంటున్న రీతిలో ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని అన్నారు. ఆహార ధాన్యాలను ఎక్కువగా పండించేందుకు కౌలు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కౌలు రైతులకు మేలు కలిగేలా, నష్చ పరిహారం.. వారికే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహరాష్ట్రలో ప్రచారం చేసిన, ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని ప్రస్తావిస్తామని బాలశౌరి తెలిపారు.
Updated Date - Nov 24 , 2024 | 02:25 PM