Share News

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jul 22 , 2024 | 07:40 PM

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...

Madanapalle Incident: ఫైళ్లు దగ్ధం.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సంచలన ఆరోపణలు

అమరావతి: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి తన అవినీతిని కప్పిపుచ్చేందుకే ఫైళ్ల కాల్చివేతకు పాల్పడినట్లు మంత్రి ఆరోపించారు. ఘటనపై ప్రాథమిక సమాచారం వచ్చినట్లు అనగాని వెల్లడించారు. వారం రోజుల క్రితం పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుపై లాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసినట్లు మంత్రి తెలిపారు. 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారని, వాటిని త్వరలో రద్దు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కీలక ఫైళ్లల్లో 90 శాతం కంప్యూటర్‌లో ఉన్నాయని, మిగతా ఫైళ్లు ఏం దగ్ధం అయ్యాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.


ఇదిగో ఇవే డాక్యుమెంట్లు!

లా డిపార్ట్మెంట్‌లో కూడా కొన్ని ఫైళ్లు పోయాయని తన దృష్టికి వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఘటన జరిగిన ఆదివారం రోజు ఉద్యోగి గౌతం, మరో ఉద్యోగి ఎందుకు కార్యాలయంలో ఉన్నారో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫైళ్ల దగ్ధంపై కొన్ని ఆధారాలు లభించినట్లు ఆయన తెలిపారు. పెద్దిరెడ్డి సతీమణి పేరిట ల్యాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. కాల్చివేత ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తోంది. దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సీరియస్ అయినట్లు అనగాని చెప్పుకొచ్చారు.


నిన్న, మొన్నటి వరకూ..!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెయ్యి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందని మంత్రి అనగాని తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకూ ఆయన కంట్రోల్లోనే ఉందని మంత్రి ఆరోపించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీఎత్తున ల్యాండ్ కన్వర్షన్ జరిగినట్లు గుర్తించామని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపైనే అనుమానం ఉన్నట్లు మంత్రి కుండబద్దలు కొట్టారు.


కఠిన చర్యలు ఉంటాయ్!

ఆదివారం రోజు ఉద్యోగులు పని చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ అన్నీ సీజ్ చేసినట్లు చెప్పారు. దీనిలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తే సక్రమంగా చేయాలని లేకుంటే పక్కకు తప్పుకోవాలని మంత్రి హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Jul 22 , 2024 | 08:13 PM