Supreme Court: సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ..
ABN, Publish Date - Nov 25 , 2024 | 01:20 PM
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్ ఆశ్రయించారు.
ఢిల్లీ: ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు (RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ (Vijaypal)కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్ ఆశ్రయించారు. అయితే దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, విజయ్‌పాల్ తరఫు న్యాయవాదులు సుధీర్ఘ వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న అనంతరం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరలే ధర్మాసనం విజయపాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
అసలు కస్టోడియల్ టార్చరే జరగలేదని, అరెస్టు వ్యవహారంతో విజయ్ పాల్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విపిపించారు. 2021లో ఘటన జరిగితే మూడేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి సింఘ్వీ తెలిపారు. ఇప్పటివరకూ ఏ కోర్టూ రఘురామను టార్చర్ చేసినట్లు ధృవీకరించలేదని ఆయన చెప్పారు. రఘురామ అరెస్టు కావడంతో సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చి అతన్ని ఆర్మీ ఆస్పత్రికి చికిత్స కోసం పంపించిన తీరును ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక కూడా ఇచ్చిందని, దానిలో స్పష్టంగా అన్ని అంశాలూ ఉన్నాయని లూథ్ర తెలిపారు.
2021 నుంచి ఇప్పటివరకూ ఒక్కరోజూ రఘురామకృష్ణరాజు ఖాళీగా కూర్చోలేదని, న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టుకు ఆయన తరఫు న్యాయవాది సుయోధన్ చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ను మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టినప్పుడు ఆయన కాళ్లకైన గాయాలను న్యాయాధికారికి చూపగా... ఆ వివరాలను అధికారికంగా నమోదు చేశారని ధర్మాసనానికి సుయోధన్ చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఇంకా ఆ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉందని రఘురామ న్యాయవాది చెప్పారు. మరోసారి వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా.. మేజిస్ట్రేట్ నమోదు చేసిన వివరాలపై సమాధానం ఉందా? అంటూ విజయ్‌పాల్ న్యాయవాది సింఘ్వీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కేసు విచారణను సుప్రీంకోర్టు ముగించింది. విజయ్‌పాల్ పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరలే ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Machilipatnam: ఇద్దరి మధ్య గొడవలు, కలిసి జీవించలేమని నిర్ణయం.. చివరికి ఏం చేశారంటే..
Viral Video: లగేజీ మధ్య నుంచి వచ్చిన దాన్ని చూసి పరుగులు పెట్టిన ప్రయాణికులు.. అసలు విషయం ఇదే..
Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..
Updated Date - Nov 25 , 2024 | 01:22 PM