YS Jagan - INDIA Alliance: ఇండియా కూటమిలోకి జగన్..?
ABN, Publish Date - Jul 26 , 2024 | 02:36 PM
YS Jagan - INDIA Alliance: వైసీపీ అధినేత జగన్.. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా? త్వరలోనే ఆ కూటమిలో చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీపై పీకల్లోతు పగతో రగిలిపోయిన జగన్.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న టీమ్‌తో జత కట్టేందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
YS Jagan - INDIA Alliance: వైసీపీ అధినేత జగన్.. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా? త్వరలోనే ఆ కూటమిలో చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీపై పీకల్లోతు పగతో రగిలిపోయిన జగన్.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న టీమ్‌తో జత కట్టేందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలను ఇస్తోంది. పైగా, తాను కాంగ్రెస్‌ను క్షమించానంటూ గతంలో జగన్ కామెంట్స్ చేయడం.. ఇప్పుడు అదే జగన్ వద్దకు ఇండియా కూటమి నేతలు వచ్చి ఆయన ధర్నాకు మద్ధతు తెలుపడం చూస్తుంటే ఇండియా కూటమిలో జగన్ చేరడం దాదాపు ఖాయం అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి నిజంగానే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారా? అసలేం జరిగింది? ఏం జరగబోతోంది? ప్రత్యేక కథనం మీకోసం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభం తరువాత జగన్‌కు బీజేపీ ముఖం చాటేసింది. అండగా ఉంటారని భావించిన పెద్దలెవరూ పట్టించుకోకుండా ఛీ పోమ్మనడంతో దిక్కులేని స్థితిలో ఉన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య ఇంతకాలం అంతర్గత స్నేహం కొనసాగినట్లు ప్రచారం జరిగినా.. ఇప్పుడు బహిరంగంగానే ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను దూరం పెట్టేసింది బీజేపీ.
వాస్తవానికి ఎన్నికల ముందు నాటికి వైసీపీ, బీజేపీ మధ్య రహస్య స్నేహం నడిచింది. కానీ, ఎన్నికల ముందు టీడీపీ, జనసేనతో జతకట్టడంతో వైసీపీని పక్కనపెట్టేసింది బీజేపీ. అయితే, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ.. రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకే ఎక్కువగా ఉండటం, నలుగురు లోక్‌సభ ఎంపీలు సైతం ఉండటంతో కేంద్రానికి తానే దిక్కు అన్నట్లుగా ఫీల్ అయిపోయారు జగన్. తన అవసరం ఉంటుందని, కేంద్రంలోని పెద్దలు తనకు అండగా ఉంటారని కలలు కంటూ వచ్చారాయన. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో తన పరిస్థితి ఏంటా? అని ఆలోచనలో పడ్డారు జగన్. ఇక లాభం లేదనుకుని.. తనకంటూ సపోర్ట్ ఉండాలని భావించి.. దోస్తీ కోసం దిక్కులు చూస్తున్నారట జగన్. ఇందుకు నిదర్శనమే ఇటీవల జగన్ ఢిల్లీ ధర్నా.
ధర్నా అట్టర్ ప్లాప్..
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, కక్ష పూరిత రాజకీయాలతో హత్యలు జరుగుతున్నాయంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేశారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో అంత జరుగుతుంది.. ఇంత జరుగుతుందంటూ బూమరాంగ్ చేయబోయారు. కానీ, అక్కడ ఆయన్నెవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ ధర్నాలో పట్టుమని 100 మంది కూడా లేని పరిస్థితి ఉంది. ఆ వంద మందిలోనూ పోలీసులు, మీడియా ప్రతినిథులు ఎక్కువగా ఉండటం విశేషం. దీన్ని బట్టి వైసీపీ ధర్నా పరిస్థితి ఏంటో ఈజీగా చెప్పేయోచ్చు.
ఇండియా కూటమి నేతల మద్ధతు..
జగన్ ధర్నాను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలెవరూ పట్టించుకోలేదు కానీ.. ఇండియా కూటమి మాత్రం అండగా నిలిచింది. కూటమిలోని పలు పార్టీల నేతలు ఆ ధర్నా స్థలి వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. జగన్‌కు మద్ధతుగా తమవంతు కొన్ని ప్రకటను చేసి వెళ్లారు. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్ వంటి వారు జగన్‌కు మద్ధతుగా ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడిదే.. రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకాలం ఎన్డీయేకు మద్ధతు ఇస్తూ వచ్చిన జగన్‌కు ఇప్పుడు ఇండియా కూటమి నేతలు మద్ధతు ఇవ్వడంపై కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయి. జగన్ ఇండియా కూటమిలో చేరబోతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్ సైతం ఈ వార్తలను ఖండించడంలేదు. దీంతో ఆయన ఇండియా కూటమిలో చేరుతారనే ప్రచారం మరింత జోరందుకుంది.
కనీసం పట్టించుకోని కేంద్ర పెద్దలు..
ఢిల్లీలో ధర్నా అంటూ వెళ్లిన వైఎస్ జగన్‌ను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలెవరూ పట్టించుకోలేదు. ధర్నా అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తామని చెప్పారు జగన్. వారి అపాయింట్‌మెంట్ కూడా కోరామని ప్రకటించారు. ఇందుకోసం రెండురోజులైనా ఎదురు చూస్తానని చెప్పారు. కానీ, జగన్‌కు అక్కడా పరాభవమే ఎదురైంది. ఏ ఒక్కరూ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. రెండు రోజులు హస్తినలో ఎదురు చూసినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక లాభం లేదనుకుని గమ్మున ఢిల్లీన నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రిటర్న్ అయ్యారు జగన్.
దోస్తీ కోసం తహతహ..
రాష్ట్రంలో అధికారం కోల్పోవడం.. కేంద్రంలో పెద్దలు ముఖం చాటేయడంతో.. దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారు. తన ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలను తలుచుకుంటూ.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటా? అని జగన్‌లో ఆందోళన మొదలైందట. అందుకే.. తనకు సపోర్ట్ అవసరం అని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే.. ఇండియా కూటమి వైపు చూస్తున్నారట. తాను చేసిన తప్పులకు శిక్ష పడితే.. అండగా నిలిచేందుకు ఎవరో ఒకరు కావాలని భావిస్తున్నారట. అందుకే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారట. ఇప్పటికే తన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్ధతు తెలుపడంతో.. ఈ కొత్త దోస్తీకి మార్గం సుగమం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే జగన్ ఇండియా కూటమిలో జాయిన్ అవుతారా? లేదా? అనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.
Also Read:
శ్వేతపత్రాలపై స్పందించిన మాజీ సీఎం జగన్
‘వచ్చే 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు'
కేసీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 26 , 2024 | 02:36 PM