AP Politics: జగన్.. నువ్వు నాయకుడివేనా?.. సునీత ఫైర్..
ABN, Publish Date - Apr 06 , 2024 | 03:50 AM
సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
బాబాయిని చంపినవారికి సీటు ఇస్తావా?
అవినాశ్‌ను ఎందుకు కాపాడుతున్నావ్?
న్యాయం, ధర్మం ఎక్కడున్నాయి?
ఈ ఘోరాన్ని ఆపడానికే ఎంపీగా నిలబడ్డా
హత్యా రాజకీయాలు చేసే అవినాశ్‌ను
కాపాడే జగన్‌ను ఓడించండి: షర్మిల
కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య
షర్మిలకు ఇవ్వాలని కోరితే అవినాశ్ వద్దన్నాడు
వివేకాను హత్య చేయించాడు: సునీత
బస్సుయాత్రలో అన్నపై విరుచుకుపడ్డ చెల్లెళ్లు
కడప, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ‘సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని కాపాడుతున్నాడని, హత్య చేసినవారికే మళ్లీ పార్టీ టికెట్ ఇచ్చాడని, న్యాయం, ధర్మం ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ ఘోరాన్ని ఆపడానికే వైఎస్సార్ బిడ్డగా తాను ఎంపీగా నిలబడ్డానని, ఇది న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటమని అన్నారు. తనవైపు న్యాయముందని, మరోవైపు వివేకా హత్య కేసు నిందితుడు, అధర్మం, అధికారం, డబ్బు ఉన్నాయని, ఎవరిని గెలిపిస్తారో ప్రజలే నిర్ణేతలని అన్నారు. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఏపీ న్యాయయాత్ర పేరిట శుక్రవారం కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం అమగంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివేకానందరెడ్డి కూతురు, షర్మిల సోదరి డాక్టర్ సునీత పాల్గొన్నారు. తొలిరోజు కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మీదుగా బస్సుయాత్ర సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి ఐదేళ్లు గడిచినా నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాశే అని సీబీఐ చెప్పిందని, ఫోన్‌కాల్స్, రికార్డులు, గూగుల్ మ్యాప్స్ ఇదే చెబుతున్నాయని, అయినా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఒకరోజు కూడా అవినాశ్ జైలుకు పోలేదని, అధికారం అడ్డుపెట్టుకుని బయట తిరుగుతున్నాడన్నారని ఆరోపించారు.
ఇద్దరినీ ఓడించాలి
‘జగన్ రాష్ట్రానికే కాదు సొంత జిల్లాకు మంచి చేయలేదు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. పార్లమెంటు, రాజ్యసభ కలుపుకొని వైసీపీకి 31 మంది ఎంపీలున్నారు. ఒక్కరోజు కూడా విభజన హామీల గురించి ప్రశ్నించలేదు. వివేకా హత్య ఎవరు చేయించారో అందరికీ తెలుసు. అయినా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇది న్యాయమేనా, ధర్మమేనా..? డాక్టర్ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టుపెట్టారు. విభజన హామీలు ఒకటీ అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేదు. కడప స్టీలు ఫ్యాక్టరీ లేదు. ఈ రోజు వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందంటే దానికి కారణం జగనే. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీటు ఇచ్చారు. ఇది దుర్మార్గం, అన్యాయం. హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదు. న్యాయం వైపున్న వైఎస్ షర్మిల కావాలో, అధర్మం వైపు ఉన్న అవినాశ్ కావాలో తేల్చుకోవాలి. హత్యా రాజకీయాలు చేసే అవినాశ్‌రెడ్డిని, కాపాడే జగన్‌రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి. బీజేపీ పొత్తులో అవినాశ్‌ను జగన్ కాపాడుతూ బానిసలా మారారు. హంతకుడు చట్టసభలకు వెళ్లకూడదనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఓటు వేసే ముందు అందరూ ఒకసారి ఆలోచించాలి. నేను వైఎస్సార్ బిడ్డను, మీ బిడ్డను. కడప జిల్లా నా పుట్టినిల్లు. జమ్మలమడుగులో పుట్టా. వైఎస్సార్ హయాంలో మొదలైన ప్రాజెక్టులకు ఇప్పటికీ మోక్షం లేదు. జగన్ పాలనలో రాష్ట్రం అధ్వానంగా తయారైంది. మద్యనిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. చంద్రబాబు 2 లక్షల కోట్లు అప్పులు చేస్తే, జగన్ 7లక్షల కోట్లు అప్పు చేశాడు’ అని షర్మిల అన్నారు.
హత్యా రాజకీయాలొద్దు: సునీత
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు రామలక్ష్మణుల్లా ఉండేవారు. నాన్న చివరి కోరిక షర్మిలను ఎంపీ చేయాలని. నాన్నను చంపిన వారికే మళ్లీ జగన్ సీటు ఇచ్చారు. హత్యారాజకీయాలు వద్దు. వైఎస్ వివేకా మన మధ్య లేరు. ఆయన వద్దకు ఎప్పుడు పోయినా పలికేవారు. కడప ఎంపీ సీటు కోసం ఆయనను కిరాతకంగా హత్య చేశారు. ఈ పని చేయించింది ఎంపీ అవినాశ్‌రెడ్డి. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎంపీ సీటు షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. అవినాశ్ వద్దని చెప్పారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నాడు. వారికి శిక్ష పడాలంటే అవినాశ్‌ను ఓడించాలి’’ అని డాక్టర్ సునీత అన్నారు.
అపూర్వ స్వాగతం
షర్మిల, సునీత సొంత జిల్లాలో చేపట్టిన బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. మీటింగ్‌కు వెళ్లొదని వైసీపీ వారు హెచ్చరించినా, మండుటెండలో కదలివచ్చిన జనానికి షర్మిల అభివాదం చేస్తూ ముందుకుసాగారు. వివేకా హత్యను ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఓ పక్క రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖరరెడ్డి తమ్ముడిని చంపిన అవినాశ్‌రెడ్డి నిలబడ్డాడు. అమ్మా ధర్మం వైపు నిలబడండి’ అని సునీతను చూపిస్తూ కోరారు.
జగన్ నియంత.. గద్దె దించాలి: కృపారాణి
కడప, టెక్కలి, ఏప్రిల్ 5: ‘జగన్ ఒక నియంత. ఆ నియంతను గద్దె దించాలి’ అని ఇటీవల ఆ పార్టీని వీడిన కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ‘ఐదున్నరేళ్లపాటు జగన్ కోసం, వైసీపీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాను. అయినా నాకు ప్రాధాన్యమివ్వకుండా పక్కన పెట్టారు’ అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన కృపారాణి ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్‌లో నియోజకవర్గం అమంగంపల్లె నుంచి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కృపారాణి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కడపలో షర్మిలను గెలిపించుకోవాలి’ అని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 06 , 2024 | 07:53 AM