Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. మిగిలింది పెద్దిరెడ్డేనా..?
ABN, Publish Date - Jul 28 , 2024 | 06:18 PM
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్‌లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
అన్నమయ్య జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్‌లో ఫైళ్ల దహనం కేసు (Madanapalle Incident) దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాబ్ పాషాను విచారించడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆదివారం నాడు సుమారు 10 మందికి పైగా పోలీసులు నవాబ్ పాషా ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ఇంటి వద్దే పోలీసులు మకాం వేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండటంతో.. ఆయన ఎప్పుడు వస్తారా అని పోలీసులు ఎదురుచూస్తున్నారు. అయితే పాషా రాగానే 41 నోటీసులు ఇచ్చి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు.
కొలిక్కి.. వస్తోంది..!!
మరోవైపు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆయన తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిలకు చెందిన పీఆర్వోతో పాటు అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట చలపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పెద్దిరెడ్డి మరో ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డి పరారీలో ఉండటంతో ఆయన కోసం వెతుకుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఒకవైపు పోలీసులు.. మరోవైపు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి వీలైనంత త్వరగా కేసును కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
కీలక పత్రాలు స్వాధీనం..!!
ఇదిలా ఉంటే.. పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉంటున్న శశికాంత్ ఇంటికి ఈరోజు ఉదయమే చేరుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు 8 గంటల పాటు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫైళ్లను భద్రంగా 4 బాక్స్‌ల్లో ఏపీకి తీసుకెళ్లారు. అయితే పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న పెద్దిరెడ్డి పీఏ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ప్లాట్ ఓనర్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ని పిలిపించిన పోలీసులు శశికాంత్ ఇంట్లో అణువణువు సోదాలు చేశారు. శశిని విచారించిన తర్వాత ఇక మిగిలింది పెద్దిరెడ్డి ఒక్కడేనని.. ఆయన ఇంట్లో సోదాలు చేసి విచారణ కూడా చేస్తారని పుంగనూరులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Updated Date - Jul 28 , 2024 | 06:26 PM