Share News

Durga Maa: ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా రానున్న సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Oct 08 , 2024 | 08:52 PM

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారి వద్దకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Durga Maa: ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా రానున్న సీఎం చంద్రబాబు..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారి వద్దకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఆనం తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.


సీఎం పర్యటన వివరాలు..

ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.." దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం రోజున(బుధవారం) సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటారు. కుటుంబ సమేతంగా దుర్గాదేవికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి ఏటా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయంగా వస్తోంది. బుధవారం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య ఆయన అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా, భద్రతా కారణాల రీత్యా ఆ సమయంలో పరిమిత సంఖ్యలోనే భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆలయంలోకి అనుమతిస్తాం. కేవలం సీఎం, వారి కుటుంబ సభ్యులు మాత్రమే అంతరాలయంలోకి వెళ్తారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు తిలకిస్తారు. ఆలయంలో తాము పూజలు చేస్తున్న సమయంలోనూ కొన్ని క్యూలైన్ల ద్వారా సాధారణ భక్తులకు దర్శనం కల్పించాలని సీఎం ఆదేశించారు.


బుధవారం ఉచిత దర్శనాలు..

బుధవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం. బుధవారం మెుత్తం భక్తులందరికీ ఉచిత దర్శన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మూలా నక్షత్రం సందర్భంగా అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అమ్మవారి దర్శనానికి ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఇంతవరకూ కొనసాగిన రూ.100, రూ.300, రూ.500ల టికెట్లతోపాటు వీఐపీ దర్శనాలు మూలా నక్షత్రం రోజున ఉండవు. ఏర్పాటు చేసిన క్యూలైన్లు అన్నింటి ద్వారా భక్తులందరికీ దర్శనం ఉచితంగానే కల్పించాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి సందర్శన, భక్తులకు కలిగించే ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించా. సీఎం తిరిగి వెళ్లిన తర్వాత సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఐదు క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాటు చేశాం. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ఎప్పటిలాగే మంచినీళ్లు, పాలు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తామని" తెలిపారు.


ఇవాళ్టి దర్శన వివరాలు..

దసరా ఉత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం నాడు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు ఇప్పటివరకూ 57,160మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.1,30,408ల ఆదాయం వచ్చింది. 1,050మంది కేశ ఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. దాదాపు 15వేల మందికి పాలు, 35వేల మందికి మజ్జిగ అందించాం. 3,190 ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తే 2,918 మంది జవాబు ఇచ్చారు. అందులో 91శాతం మంది ఆలయ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా ఒక్కో లడ్డూను భక్తులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. అమ్మవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి స్వాగత వీడ్కోలుకు 56మందిని ఎంపిక చేశాం. రేపు సాయంత్రం నాలుగు గంటల వరకూ వీఐపీ దర్శనాలు లేవు. కేవలం పూర్తి ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయి" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada: ఘోరం.. రోడ్డుప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య..

బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత.. ఎంతమంది అంటే..

Pawan Kalyan: బాలికపై అత్యాచారం.. తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్..

Updated Date - Oct 08 , 2024 | 09:07 PM