Share News

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనం వేళలు ఇవే..

ABN , Publish Date - Oct 02 , 2024 | 07:24 PM

ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపట్నుంచి పది రోజులపాటు కనకదుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనం వేళలు ఇవే..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపట్నుంచి పది రోజులపాటు కనకదుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు పూర్తి చేశారు. పది రోజులపాటు జరిగే మహోత్సవాలకు సుమారు 13నుంచి 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో రామారావు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగు నీరు, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు సహా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈసారి లేజర్ షో, కృష్ణమ్మ హారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు ఆయన తెలిపారు.


15లక్షల మంది..

ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ.." ఇంద్రకీలాద్రిపై రేపటి (గురువారం) నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి అమ్మవారి దర్శనం మెుదలవుతుంది. దసరా ఉత్సవాలకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశాం. ఈ వేడుకలు రెండోసారి నిర్వహించే గొప్ప అదృష్టం అమ్మవారు, రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చింది. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు 10అవతారాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు. ఇప్పటికే భక్తుల కోసం తాగునీరు, పార్కింగ్, వైద్య సేవలు సహా పలు ఏర్పాట్లు చేశాం. ఈసారి లేజర్ షో, కృష్ణమ్మ హరతులు ఏర్పాటు చేశాం. సుమారు 13నుంచి 15లక్షల మంది భక్తులు మహోత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నాం.


దర్శనం వేళలు..

గురువారం ఉదయం 9గంటల నుంచి దర్శనం ప్రారంభం అవుతుంది. అయితే శుక్రవారం నుంచి ఉదయం 4లకే ప్రారంభం అవుతుంది. మహా నివేదన సమయంలో కాసేపు దర్శన విరామం ఉంటుంది. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4నుంచి 5వరకూ దర్శన ఏర్పాటు చేస్తున్నాం. ప్రొటోకాల్‌కు ఉదయం 8నుంచి 10వరకూ సమయాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. శివాలయం దగ్గర చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేశాం. బస్సులు, కార్ల ద్వారా భక్తులు రావొచ్చు. ఖడ్గమాల ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయి. చండియాగం ప్రతిరోజూ 9గంటలకు నిర్వహిస్తారు. పరోక్ష సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రేపట్నుంచి అంతరాలయం దర్శనాలు ఉండవు. నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.300, రూ.500ల దర్శన టికెట్లు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశాం. అన్ని క్యూలైన్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాం. సీతమ్మ పాదాల వద్ద కేశ కండనశాల ఏర్పాటు చేశాం. 150 మరుగుదొడ్లు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహాయంతో ఏర్పాటు చేశాం. 12వ తారీకున తెప్పొచ్చవం జరుగుతుంది. 12న పూర్ణహుతితో నవరాత్రులు ముగుస్తాయి.


ప్రత్యేక యాప్..

ఆలయం సహా చుట్టుపక్కల ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంటుంది. 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. 25లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాం. మీడియా వారికీ కొండపైనే పోడియం ఏర్పాటు చేశాం. లిఫ్ట్ మార్గాలు ఉండవు. ఎగ్జిట్ మార్గాల నుంచి లోపలోకి రావడానికి అనుమతి లేదు. కట్టుదిట్టంగా బారిగేట్లు ఏర్పాటు చేశాం. ప్రతి 30మీటర్లకూ ఒక అత్యవసర ఎగ్జిట్ ఏర్పాటు చేశాం. వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా 17మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. ఉచిత ప్రసాదం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ ఉంటుంది. ఉత్సవాల సమాచారం కోసం దసరా మహోత్సవం-2024 అనే మెుబైల్ యాప్‌ను తీసుకొచ్చాం" అని తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 07:40 PM