AP NEWS: ఆయన ద్వారా చాలా అంశాల్లో ప్రభావితం అయ్యాను: జస్టీస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Feb 12 , 2024 | 09:06 PM
ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితం అయ్యానని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ(justice NV Ramana) తెలిపారు.
విజయవాడ: ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితం అయ్యానని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ(justice NV Ramana) తెలిపారు. డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య 50సంవత్సరాల వృత్తి విరామ అభినందన సత్కార సభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, వివిధ రంగాలకు చెందిన పలువురు వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టీస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. పట్టాభిరామయ్య ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించారని తెలిపారు.
వైద్య వృత్తిని ధనార్జనగా చూడకుండా సేవా మార్గంతో నడిచారన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో జీవితం నడిపారని తెలిపారు. సమాజం, రాజకీయ పరమైనా అంశాల్లో మా ఇద్దరికీ వైరుధ్యం ఉండేదన్నారు. అయినా తమ అభిప్రాయాలను ఎప్పుడూ గౌరవించే వారని తెలిపారు. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. స్థిత ప్రజ్ఞతకు ఆయన నిజంగా నిదర్శనమని చెప్పారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో పట్టాభిరామయ్య పాత్ర కూడా ఉందన్నారు. విలువలు కలిగిన రాజకీయాలు చేయాలని లోక్ సత్తాలో చేరారని తెలిపారు. ఆయనకున్న పలుకుబడికి ఏ పార్టీ అయినా పదవులు ఇచ్చేదని అన్నారు. సామాన్యులు, సమాజం కోసమే పట్టాభి రామయ్య ఆలోచించారని ఎన్వీ రమణ పేర్కొన్నారు.