Pawan Kalyan: డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో పవన్ కల్యాణ్ సమావేశం
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:59 PM
ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు(మంగళవారం) వచ్చారు. బ్యారేజ్‌లు, వరద మానిటరింగ్, వాతావరణ హెచ్చరికలను పవన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు.
అమరావతి: ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు(మంగళవారం) వచ్చారు. బ్యారేజ్‌లు, వరద మానిటరింగ్, వాతావరణ హెచ్చరికలను పవన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పనితీరును పవన్ ప్రశంసించారు. విపత్తులపై అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో విపత్తులు నిర్వహణ వ్యవస్థ బాగా పనిచేసిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
భారీవర్షాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోలో రూమ్ వివరాల సేకరణ..
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే, ఏపీలో జరిగిన వరద నష్టం తదితర వివరాలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోలో రూమ్ నుంచి అధికారులు సమాచారాన్ని తెలిపారు.
భారీ వర్షాలు, వరదలు సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించామని తెలిపారు. 149 పశువులు, 59,848 కోళ్లు మరణించాయని చెప్పారు. 11968 వేల పశువులకు వ్యాక్సిన్ అందించామని అన్నారు. 12 విద్యుత్ సబ్ స్టేషన్స్ దెబ్బతిన్నాయని వివరించారు. అధిక వర్షాల కారణంగా 2851 కిమీ పొడవున ఆర్& బి రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. 180243 హెక్టార్లలో వరి పంట, 17645 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగాయని తెలిపారు. 221 కిమీ మేర పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. 78 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు. భాదితులకు 6 హెలికాప్టర్ల ద్వారా 4870 కేజిల ఆహరాన్ని అందిచినట్లు వివరించారు. క్షిష్ట పరిస్థితుల్లోని 21 మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించామని అధికారులు వెల్లడించారు.
Updated Date - Sep 03 , 2024 | 11:08 PM