జెత్వానీ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి!
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:51 AM
ముంబై సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం హైకోర్టుకు నివేదించారు.
సవివర కౌంటర్‌కు సమయం ఇవ్వండి
హైకోర్టును అభ్యర్థించిన ఏజీ దమ్మాలపాటి
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ముంబై సినీనటి కాదంబరి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం హైకోర్టుకు నివేదించారు. నిందితులైన పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు సవివరంగా కౌంటర్ దాఖలు చేయడం అవసరమని.. అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించారు. జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు తమపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై వారి తరఫు వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్, జెత్వానీ వాదనల కోసం విచారణ వాయిదా పడిన విషయం తెలిసిందే.