Share News

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:05 AM

అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

  • అగ్రరాజ్య సరుకుల దిగుమతులపై సుంకం మళ్లీ పెంపు

  • 90 రోజుల నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందునే!

  • అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన

  • ఈయూ కలిసిరావాలి.. కఠోర శ్రమతో మేం ఎదిగాం: జిన్‌పింగ్‌

  • అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం: జైశంకర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా ప్రతీకార బాదుడు సుంకాలు మొదలుపెట్టినప్పటి నుంచి అటు అగ్రరాజ్యం, ఇటు డ్రాగన్‌ దేశం పోటాపోటీగా సుంకాల విధింపును పెంచుకుంటూ పోతుండడం తెలిసిందే. కాగా, తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 145 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన చైనాకు ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు 75 దేశాల్లో సుంకాల పెంపుదల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ.. చైనాలో మాత్రం అమలవుతుందని ట్రంప్‌ చెప్పడాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. అమెరికాపై అంతకుముందు 84 శాతానికి పెంచిన సుంకాన్ని శుక్రవారం ఏకంగా 125 శాతానికి పెంచేసింది. అయితే ఇకపై మరింత పెంచే ఆలోచన లేదని పేర్కొంది. అమెరికా మరిన్ని అదనపు సుంకాలు విధించినా తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే తమ దేశంపై అసాధారణమైన రీతిలో సుంకాలు పెంచడం ద్వారా అంతర్జాతీయ, ఆర్థిక వాణిజ్య నిబంధనలను, ప్రాథమిక ఆర్థిక చట్టాలను అమెరికా పూర్తిగా ఉల్లంఘించిందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇది తమపై బెదిరింపులకు దిగడమేనని ఆక్షేపించింది.


సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు..

సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలు ఉండరని, కానీ.. దీనివల్ల అంతర్జాతీయ సమాజం మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. ఈ అంశంపై ఆయన తొలిసారి బహిరంగంగా స్పందించారు. అన్నారు. ఏడు దశాబ్దాలుగా చైనా కఠోర శ్రమతో ఎదిగిందని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడలేదని తెలిపారు. పైగా తమను అకారణంగా అణచివేయాలని చూసినవారెవరికీ వెన్ను చూపలేదని స్పష్టం చేశారు. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. అమెరికా ఏకపక్షవాదాన్ని, ఆర్థిక దౌర్జన్యాన్ని తిప్పికొట్టడంలో, అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా ఈయూ తమ హక్కులను, ప్రయోజనాలను కాపాడుకోవాలని అన్నారు. కాగా, స్పెయిన్‌కు, ఈయూకు చైనాతో వాణిజ్య లోటు ఉందని, దీనిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శాంచెజ్‌ అభిప్రాయపడ్డారు. అయితే తమ బంధాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో వాణిజ్యపరమైన ఆందోళనలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మరోవైపు తమపై అమెరికా పన్నాగాలు పనిచేయవని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. తమతో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా భావిస్తే ముందుగా బాధ్యతారహితమైన చర్యలను ఆపాలని హితవు పలికింది.


అమెరికా, ఈయూతో భారత్‌ ఒప్పందం: జైశంకర్‌

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కొలిక్కి తెచ్చే విషయాన్ని భారత్‌ అత్యంత ఆవశ్యక అంశంగా పరిగణిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన గ్లోబల్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాలుగేళ్లపాటు చర్చలు జరిపామని, అయినా ఒప్పందం కుదరలేదని అన్నారు. ప్రస్తుతం పూర్తి సంసిద్ధంగా ఉన్నామని, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఇక యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని జైశంకర్‌ ప్రస్తావిస్తూ.. ఈ విషయంలో 23 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయంటున్నారని, కానీ.. అది నిజం కాదని అన్నారు. ఈయూతో ఒప్పందం విషయంలో కొన్ని అడ్డంకులున్నాయని, ఈసారి వాటిని అధిగమించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 05:05 AM