Botcha Satyanarayana: పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్
ABN , Publish Date - Aug 08 , 2024 | 01:50 AM
అధికారం శాశ్వతం కాదు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయ్’ అంటూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ఐదేళ్లు కళ్లుమూసుకుంటే..
మళ్లీ అధికారంలోకి: బొత్స
మీడియాపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు
అనకాపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ‘అధికారం శాశ్వతం కాదు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయ్’ అంటూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయని, మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నవారు గౌరవ, మర్యాదలతో ప్రవర్తించాలని సూక్తులు వల్లించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బొత్స బుధవారం అనకాపల్లిలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మాయచేస్తారన్నారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడతారని, చంద్రబాబు జిమ్మిక్కులు చేయడంలో దిట్టని విమర్శించారు. ప్రభుత్వ లోపాలపై సంక్రాంతి వరకు ప్రశ్నించకూడదని తాము నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థ్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 858 ఓట్లు ఉండగా, 630కిపైగా ఓటర్లు వైసీపీ వారేనని, టీడీపీకి 228 ఓటర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు.
మీడియావారికి పనేమీ ఉండదు..!
అనంతరం విలేకరుల సమావేశంలో మీడియాపై బొత్స అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన ముందున్న టీవీ చానళ్ల మైకులను లెక్కపెట్టి.. మొత్తం పది మైకులున్నాయని, వారికి ఏమీ పని ఉండదని వ్యాఖ్యానించారు. అరకు, పాడేరు నుంచి 114 మంది వైసీపీ నేతలు జగన్‌ను కలిసేందుకు అమరావతికి వెళితే, క్యాంపులు పెట్టుకున్నారని రాస్తున్నారని.. పప్పో, ఉప్పో రాసుకోకపోతే వారికి గడవదని ఆక్షేపించారు.