ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు!

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:44 AM

జగన్‌ సర్కారు కాంట్రాక్ట్‌ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్‌ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.

  • జగన్‌ సర్కారు అరాచకం, మేఘా అలసత్వమే కారణం

  • అధికారంలోకి రాగానే నిర్మాణ పనుల ఆపివేత

  • నవయుగను మార్చి మేఘాకు కాంట్రాక్టు అప్పగింత

  • సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం

  • భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌

  • కాఫర్‌ డ్యామ్‌లకు సీపేజీ, కూలిన గైడ్‌ బండ్‌

  • రూ.1,771 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు పడక

  • మరో ఐదేళ్లయినా పూర్తి కావడం కష్టమే

  • మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం

  • కేంద్ర ప్రాథమిక అంచనా రూ.15,511 కోట్లు

  • 20 వేలకోట్లు అవుతుందని నిపుణుల అంచనా

జగన్‌ సర్కారు కాంట్రాక్ట్‌ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్‌ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది. గిన్నిస్‌ రికార్డు ఉన్న నవయుగ సంస్థను తప్పించి, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట మేఘా సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. జగన్‌ అడ్డగోలు నిర్ణయాలు, మేఘా అలసత్వం కారణంగా పోలవరం ప్రాజెక్టు విధ్వంసమైంది. మేఘా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో వరదలకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. గైడ్‌ బండ్‌ కూలింది. ఫలితంగా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రాథమిక అంచనా ప్రకారం రూ.15,511 కోట్లు కావాలి. వాస్తవానికి 20 వేల కోట్లు అవుతుందని నిపుణుల అంచనా. జగన్‌ సర్కారు తప్పిదాలతో వేల కోట్లు భారం పడటమే గాక ఏళ్ల కొద్దీ సమయం వృథా అవుతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అటు బందరు పోర్టును బలి చేశారు. రాష్ట్రానికి జీవనాఢి అయిన పోలవరం ప్రాజెక్టును ముంచేశారు. నవ్యాంధ్రకు కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులు నాశనం కావడానికి కారకుల్లో... ఒకటి జగన్‌ సర్కారు అయితే, రెండోది కాంట్రాక్టు సంస్థ మేఘా. టీడీపీ ప్రభుత్వంలో సవ్యంగా సాగుతున్న బందరు పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జగన్‌ సర్కారు రాగానే నిలిపేసింది. అప్పటి వరకు రెండింటి నిర్మాణ పనులను చేస్తున్న నవయుగ సంస్థను తొలగించింది. టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ కక్షసాధింపులతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో డ్రామాలు ఆడింది. అడ్డగోలు విధానాలతో బందరు పోర్టుతో పాటు పోలవరం నిర్మాణ పనులను మేఘాకు అప్పగించింది. అప్పటి నుంచే బందరు పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. సముద్ర పనుల నిర్మాణాల్లో ఏమాత్రం అనుభవం లేని మేఘా బందరు పోర్టు నిర్మాణ పనులను అతీగతీ లేకుండా చేసింది. మరోవైపు కాంట్రాక్టు తీసుకున్న వెంటనే పనులు చేపట్టకుండా పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది. జగన్‌ అరాచక పాలనలో మేఘా కాంట్రాక్టు సంస్థ నిర్వాకం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది.

జగన్‌ రాకతో విధ్వంసం

2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌.. వారం రోజులు తిరక్కుండానే జూన్‌ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ నవయుగ ఇంజనీరింగ్‌ను తొలగించారు. 2019 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టులో రూ.1,771 కోట్ల అంచనాతో మిగిలిన హెడ్‌వర్క్స్‌ పనులను.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1,548.12 కోట్లకు మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగించారు. ఇవిగాక పోలవరం హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులను రూ.2,800 కోట్లకు అప్పగించారు. తద్వారా రూ.680 కోట్ల మేర ఆదా చేశామని జగన్‌ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది. వాస్తవానికి పోలవరం నిర్మాణ పనుల్లో రూ.222.88 కోట్లు (రూ.1771 కోట్లు-1548.12 కోట్లు) మాత్రమే మిగులు కనిపిస్తున్నా ఏకంగా 680 కోట్ల మేర ఆదా చేశామంటూ ఆర్భాటం చేసింది. జాతీయ స్థాయిలోనూ పత్రికలకు ప్రకటనలు గుప్పించింది.


అయితే రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిగా జగన్‌, నిర్మాణ సంస్థగా మేఘా తీరని ద్రోహం చేశాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టును 2021 డిసెంబరు నాటికి పూర్తి చేస్తానని 2019 నవంబరులో హెడ్‌వర్క్స్‌ ఆర్డర్‌ను తీసుకున్న మేఘా ఆమోద పత్రాన్ని సమర్పించింది. అయితే మేఘా సకాలంలో పనులు ప్రారంభించలేదు. 2019 నవంబరు నుంచి 2021 నవంబరు దాకా కీలకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల గ్యాప్‌లను పూడ్చలేదు. దీని ఫలితంగా డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఐఐటీ హైదరాబాద్‌ అధ్యయన నివేదికలో ఇదే విషయాన్ని పేర్కొంది. కాంట్రాక్టు సంస్థను మార్చడం వల్లే పోలవరానికి తీరని ద్రోహం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సకాలంలో పనులు ప్రారంభించకున్నా నాటి ముఖ్యమంత్రి జగన్‌ ప్రశ్నించలేదని, నిర్మాణ సంస్థగా మేఘా బాధ్యతను తీసుకోలేదని నిపుణులు ఆరోపిస్తున్నారు.

పోలవరం పనులు మేఘా చేజిక్కించుకునే సమయానికి హెడ్‌వర్క్స్‌ పనులు 72 శాతం పూర్తయ్యాయి. వాస్తవానికి మిగిలిన 28 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేసి, రాష్ట్రానికి గోదావరి జలాలు అందించాల్సి ఉండాలి. సకాలంలో నిర్మాణ పనులు చేపట్టని కారణంగా నిర్మాణం ధ్వంసమైంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌-1, గ్యాప్‌-2ను పూడ్చక పోవడంతో 2020లో 22 లక్షల క్యూసెక్కుల వరదకు డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఎగువ దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు సీపేజీ కారణంగా నీరు ఉబుకుతుంది. గైడ్‌ బండ్‌ కూలింది. గ్యాప్‌-1, గ్యాప్‌-2 మధ్య భారీ గుంత ఏర్పడింది. డయాఫ్రమ్‌వాల్‌ మరమ్మతులకు కూడా అవకాశం లేకుండా పోయింది.

జగన్‌ సర్కారు తప్పిదాలు, మేఘా అలసత్వం కారణంగా 2021 నవంబరు నాటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనులు 2030 నాటికైనా పూర్తవుతాయా అనే ఆందోళన నెలకొంది. మరోవైపు రూ.1,771 కోట్లతో పూర్తి కావాల్సిన పనుల వ్యయం కేంద్ర ప్రాథమిక అంచనా ప్రకారం రూ.15,511 కోట్లకు చేరింది. నిర్మాణ డిజైన్లు దెబ్బతినడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, కెనడాలకు చెందిన అంతర్జాతీయ నిపుణుల సలహాలను తీసుకోవాల్సి వచ్చిందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర అంచనా రూ.15,511 కోట్లు

పోలవరం ప్రాజెక్టు దెబ్బతినడంతో మరమ్మతులకు రూ.15,511.13 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. ఈ మెత్తానికి 2024 మే నెలలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందాల్సి ఉంది. కేబినెట్‌ నోట్‌ కూడా సిద్ధమైంది. కానీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌కు రూ.15,511.13 కోట్ల నిధుల మంజూరు ప్రతిపాదన వెళ్లలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యం వల్ల (15,511.13-1,771) రూ.13,740.13 కోట్ల మేర కేంద్రంపై భారం పడిందని జల వనరుల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 20 వేల కోట్ల వరకూ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం వల్ల పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సవాలే. గత ఐదేళ్లలో జరిగిన నష్టాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు? ఏ నిర్ణయం తీసుకుంటారో?

అనుభవజ్ఞులైన నిపుణులేరీ?

పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలంటే అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్‌ నిపుణులు అవసరం. అలాంటివారు మేఘాకు ఉన్నారా? అని జలవనరుల నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మేఘాకు నిపుణులలేమి కారణంగానే సకాలంలో పనులు చేపట్టలేదని, దాని ఫలితమే పోలవరం ప్రాజెక్టును శిఽథిలం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


‘రివర్స్‌’ మిగులు అబద్ధం

జగన్‌ సర్కారు వచ్చాక పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ నవయుగను మార్చకుండా కొనసాగించి ఉంటే రూ.1,771 కోట్లతో సకాలంలో 2020 డిసెంబరు నాటికే పూర్తయ్యేది. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట జగన్‌ సర్కారు చేసిన తప్పిదాల వల్ల భారీ నష్టం జరిగింది. మేఘాకు రూ.1,548.12 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చినా, అదనపు పనుల పేరిట మొత్తం వ్యయం రూ.4,637.09 కోట్లకు పెరిగింది. దీన్నిబట్టి రివర్స్‌ టెండరింగ్‌లో మిగులు అంతా అబద్ధమని తేలిపోయింది. టెండరు ఇచ్చిన కొద్ది రోజులకే రూ.1548.12 కోట్లకు అదనంగా రూ.3088.97 కోట్లు మేఘాకు జగన్‌ సర్కారు చెల్లింపులు జరిపింది. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా దాచి పెట్టింది.

అలసత్వంతో భారీ నష్టం

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌-1, గ్యాప్‌-2ను పూడ్చక పోవడంతో 2020లో డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. గైడ్‌ బండ్‌ కూలింది. గ్యాప్‌-1, గ్యాప్‌-2 మధ్య భారీ గుంత ఏర్పడింది. దీంతో పోలవరం హెడ్‌వర్క్స్‌ ప్రగతి 72 శాతం నుంచి తిరోగమనంలో 45 శాతానికి పడిపోయింది. ప్రధాన కట్టడాలు దెబ్బతినడంతో అత్యవసర మరమ్మతుల కింద రూ.2077.78 కోట్లను జల వనరుల శాఖ వ్యయం చేయాల్సి వచ్చింది. అంతేగాక అదనపు పనులతో కూడిన వ్యయం రూ.4637.09 కోట్లకు ఈ మొత్తాన్ని కలిపితే రూ.6,710.87 కోట్లకు పెరిగిపోయింది. ఇది కాక డయాఫ్రమ్‌వాల్‌ మరమ్మతుకు రూ.447 కోట్లు, కొత్తగా ప్లాస్టిక్‌ డయాఫ్రమ్‌వాల్‌ను సమాంతరంగా నిర్మించేందుకు రూ.990 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మేఘా వెనువెంటనే పనులు చేపట్టి డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను వేసి ఉంటే ఈ అదనపు ఖర్చు ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఐదేళ్లలో కష్టమే

మేఘా నిర్మాణ పనుల్లో చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుకు భారీ నష్టం జరిగింది. అంతేగాక సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయలేని దుస్థితి. కొత్తగా డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడంతో పాటు పాతవాల్‌ను మరమ్మతు చేయాలి. ఇందుకోసం రెండు సీజన్లు అంటే .. రెండేళ్ల సమయం తీసుకుంటుంది. అది కూడా పోలవరంపై అంతర్జాతీయ నిపుణులు ఏడాదిలోగా అధ్యయన నివేదిక ఇచ్చి, దానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరిస్తేనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో డయాఫ్రమ్‌వాల్‌ పనులు ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి 2027 జనవరి వస్తుంది. దీనికి ముందు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల సీపేజీని నివారించేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు కనీసం ఆర్నెళ్లు లేదా సంవత్సర కాలమైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఈ పనులు చేయడానికి 2028 వరకూ సమయం పడుతుంది. ఆ తర్వాత డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించాలంటే రెండేళ్ల సమయం తీసుకుంటుంది. అంటే.. 2030 వచ్చేస్తుంది. ఆలోగా మళ్లీ సార్వత్రిక ఎన్నికలూ వస్తాయి. ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయడమంటే అద్భుతమేనని నిపుణులు అంటున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 05:44 AM

Advertising
Advertising
<