Share News

ఆ పాపం బోర్డుదే!

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:46 AM

తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే విషయం శాస్త్రీయంగా వెల్లడవడంతో జగన్‌ జమానాలో జరిగిన అవకతవకలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఆ పాపం బోర్డుదే!

గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి

చిన్నాచితక వ్యాపారులు సైతం నెయ్యి

అందించేలా అడ్డగోలు తీర్మానాలు

అనుభవం, సామర్థ్యం, నాణ్యత,

టర్నోవర్‌ నిబంధలన్నీ సడలింపు

అధికారంలోకి వచ్చీరాగానే..

తిరుమల నెయ్యిపైనే వైసీపీ కన్ను

తమవారి కోసం రివర్స్‌ టెండరు

కొనుగోలు నిబంధనల్ని మార్చేసిన

వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి

(తిరుపతి - ఆంధ్రజ్యోతి)

తిరుమల లడ్డూలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే విషయం శాస్త్రీయంగా వెల్లడవడంతో జగన్‌ జమానాలో జరిగిన అవకతవకలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయినవారికే టెండర్లు కట్టబెట్టే యోచనలో రివర్స్‌ టెండర్‌లతో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలనే వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని అప్పటి పాలకమండలి మార్చేసింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రామాణికమైన సంస్థలకే పరిమితమైన నెయ్యి సరఫరాను చిన్నా చితకా వ్యాపారులకూ అవకాశం కలిగేలా నిబంధనలు సడలించింది. 2019 ిడిసెంబరు 19న జరిగిన పాలకమండలి సమావేశంలో, మరిన్ని సంస్థలకు అవకాశం కలిగించేలా సూచనలు చేయాలంటూ (తీర్మానం నెం. 220) ఒక కమిటీని అప్పటి పాలకమండలి ఏర్పాటుచేసింది. 2020 జనవరి 23న ఆ కమిటీ ఒక నివేదిక సమర్పించింది. దానిని పర్చేజ్‌ విభాగానికి పంపారు. అదే ఏడాది ఫిబ్రవరి 18న పర్చేజ్‌ విభాగం దానికి ఆమోదం తెలిపింది. ఆ వెంటనే ఫిబ్రవరి 29న (తీర్మానం నెం. 371) యధాతఽథంగా సిఫారసులన్నింటికీ వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి ఆమోదం తెలిపింది.

ఇందుకనుగుణంగా టెండర్‌ నిబంధనలలో కొన్నింటిని సడలించింది. మరికొన్నింటిని పూర్తిగా ఎత్తివేసింది. స్పెషల్‌ గ్రేడ్‌ ఆగ్‌మార్క్‌ నాణ్యత కలిగిన ఆవు నెయ్యిని ట్యాంకర్లలో కొనుగోలు చేయడానికి అమల్లో ఉన్న నిబంధనలను పాలకమండలి మార్చేసింది. దాంతో కోరుకున్న సంస్థలు నెయ్యి సరఫరాకు రంగంలోకి దిగాయి. లాభాలే లక్ష్యంగా లక్షల లీటర్ల నెయ్యిని తిరుమలకు సరఫరా చేశాయి. గత ప్రభుత్వంలో కన్నా తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేసి ఆదా చేస్తున్నాం అని చెప్పడం మీద దృష్టిపెట్టారు గానీ, వారు సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత మీద శ్రద్ధ పెట్టలేదు. పాలక పెద్దల అండదండలతోనే టెండర్లు దక్కించుకున్నారు కాబట్టి టీటీడీ ఉద్యోగులు కూడా అభ్యంతరపెట్టే సాహసం ఏ దశలోనూ చేయలేకపోయారు. నెయ్యి ప్రహసనం నాలుగేళ్ల కిందటే మొదలైందని సవరించిన, సడలించిన, తొలగించిన నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అవి ఇలా సాగాయి.


జాతీయ సంస్థలకు...

ట్యాంకర్లలో నెయ్యి సరఫరా చేసే సంస్థలకు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలన్న నిబంధనను సవరించి, ఏడాది చాలంటూ సడలించారు.

నెయ్యి సరఫరా చేసే సంస్థ కనీసం రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్ధ్యం కలిగి ఉండాలనీ, ఆ పరిమాణంలో కనీసం ఏడాదిగా సేకరిస్తూ ఉండాలనీ ఉన్న నిబంధనను పూర్తిగా తొలగించారు.

తన రెగ్యులర్‌ మార్కెట్‌ అవసరాలకు అదనంగా కనీసం ఎనిమిది టన్నుల ఆవు నెయ్యి ప్రాసెస్‌ చేసే సామర్ధ్యం, ఏడాది నుంచీ కలిగి వుండాలనీ, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఐకి (ఆహార భద్రత- ప్రమాణాల భారతీయ సంస్థ) సమర్పించిన రిటర్నుల్లో కూడా ఆ వివరాలు రికార్డయి ఉండాలనీ అప్పటిదాకా ఉన్న నిబంధననూ పాలకమండలి పూర్తిగా ఎత్తివేసింది.

నెయ్యి సరఫరా చేసే సంస్థ నెయ్యి తయారీ కోసం ఇతర డెయిరీల నుంచీ మిల్క్‌ క్రీమ్‌ లేదా మిల్క్‌ బటర్‌ సేకరించేటట్లు అయితే వాటిని ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచే సేకరించాలనీ, ఆ సంస్థ ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లైసెన్స్‌ కలిగి, ఎఫ్‌ఎ్‌సఎంఎస్‌ లేదా హెచ్‌ఏసీసీపీ, క్యూఎంఎస్‌ తదితర సర్టిఫికెట్లు కలిగి ఉండాలనీ, కనీసం రోజుకు 12 టన్నుల ఆవు పాల కొవ్వు సేకరించే సామర్ధ్యం కలిగి ఉుండాలనీ నిబంధన ఉండేది. దానిని ఎనిమిది టన్నులకు కుదించేశారు. ఆ సామర్ధ్యంతో కనీసం మూడేళ్లుగా వ్యాపారం సా గిస్తూ ఉండాలనే నిబంధనను ఏడాదికి తగ్గించేశారు.

నెయ్యి సరఫరా చేసే సంస్థ కనీస వార్షిక టర్నోవర్‌ రూ. 250 కోట్లు ఉండాలని, ఆ మేరకు గడచిన మూడేళ్లలో ఒక ఏడాదికి సంబంధించిన ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించాలని నిబంధన ఉండగా, వార్షిక టర్నోవర్‌ను రూ. 150 కోట్లకు సడలించారు.


రాష్ట్ర స్థాయి కొనుగోళ్లకూ అవే సడలింపులు

ఏపీ పరిధిలో స్పెషల్‌ గ్రేడ్‌ ఆవు నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు టెండరు దాఖలు చేయాలంటే ఆ సంస్థ కనీసం మూడేళ్ల్ళగా నడుస్తూ ఉండాలన్న నిబంధనను ఏడాదికి తగ్గించేశారు.

గడచిన ఏడాదిలో కనీసం 2 లక్షల ఆవు పాలను సేకరించి ఉండాలన్న నిబంధనను ఎత్తివేశారు.

రోజువారీ మార్కెటింగ్‌కు అదనంగా మూడు టన్నుల నెయ్యిని ప్రాసెస్‌ చేసే సామర్ధ్యం కలిగి ఉండాలన్న నిబంధననూ తొలగించారు.

టెండరుదారు ఇతర సంస్థల నుంచీ క్రీమ్‌ లేదా బటర్‌ సేకరించేటట్టయితే సంబంధిత సంస్థ రోజుకు కనీసం ఆరు టన్నుల ఆవుపాల కొవ్వును సేకరించే సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధనను మూడు టన్నులకు తగ్గిస్తూ సడలించారు.

సంస్థ కనీసం మూడేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తూ ఉండాలనే నిబంధనను ఏడాదికి తగ్గించారు.

టెండరుదారు వార్షిక టర్నోవరు రూ.వంద కోట్లు ఉండాలన్న నిబంధనను రూ. 50 కోట్లు ఉంటే చాలని సడలించారు.


నెయ్యి టిన్నుల కొనుగోలునిబంధనలదీ అదే దారి

నెయ్యిని టిన్నుల్లో కొనుగోలు చేయడానికి అమల్లో వున్న నిబంధనలను సైతం నాటి టీటీడీ పాలకమండలి 2022లోనే సడలించింది. టెండరుదారు కనీసం మూడేళ్లుగా ఈ వ్యాపారం చేస్తుండాలన్న నిబంధనను సడలించి ఏడాదికి కుదించారు. గడచిన ఏడాదిలో టెండరుదారు కనీసం 2 లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించి ఉండాలన్న నిబంధనను పూర్తిగా తొలగించారు. రెగ్యులర్‌ మార్కెట్‌ అవసరాలకు అదనంగా కనీసం 2 టన్నుల నెయ్యి ప్రాసెస్‌ చేసే సామర్థ్యం కలిగి ఉండాలన్న నిబంధనను కూడా ఎత్తివేశారు. టెండరుదారు ఇతర సంస్థల నుంచీ క్రీమ్‌ లేదా బటర్‌ సేకరించే పక్షంలో సంబంధిత సంస్థ రోజుకు నాలుగు టన్నుల ఆవుపాల కొవ్వు సేకరించాలన్న సామర్ధ్యాన్ని రెండు టన్నులుంటే చాలని కుదించారు.

Updated Date - Sep 25 , 2024 | 04:46 AM