AP Politics: సంక్షేమ పాలన కోసం టీడీపీని గెలిపించాలి: వసంత కృష్ణ ప్రసాద్
ABN, Publish Date - Mar 26 , 2024 | 10:04 PM
అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన కోసం బీజేపీ - తెలుగుదేశం - జనసేన పార్టీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) కోరారు. మంగళవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలో టీడీపీ నాయకులతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా - జి.కొండూరు: అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన కోసం బీజేపీ - తెలుగుదేశం - జనసేన పార్టీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) కోరారు. మంగళవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. చిన్న నందిగామ గ్రామంలో కృష్ణ ప్రసాద్‌కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో ఏనాడు కేసులను ప్రోత్సహించలేదని చెప్పారు.
తనకు తెలియకుండా కొందరు నాయకులు కేసులు పెడితే వారించానని అన్నారు. 2018 నుంచి 2024 వరకు సౌమ్యుడిగా పనిచేశానని తెలిపారు. 30 ఏళ్లుగా చేస్తున్న వ్యాపారాన్ని ప్రజా సేవ కోసం పక్కన పెట్టానని అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు పనిచేస్తానన్నారు. మైలవరం నియోజవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం తను ఎంతో కష్టపడి పనులు చేయించినప్పటికీ సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని వివరించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు తనతోపాటు నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా, పరిశ్రమలు రాకుండా ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయని ప్రశ్నించారు.
ముఖ్యంగా పేదరిక నిర్మూలన ఎలా సాధ్యపడుతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకుండా అడ్డుపడి, మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎన్నో లోపాల కారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే సన్నిహితుల సలహా మేరకు టీడీపీలో చేరినట్లు చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశాల ప్రకారం మైలవరం నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
Updated Date - Mar 26 , 2024 | 10:58 PM