Share News

Visakha: జాయ్ జమీమా.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బాధితుడి తల్లి..

ABN , Publish Date - Dec 10 , 2024 | 05:07 PM

హనీ ట్రాప్ కేసులో అరస్టయ్యి జైల్లో ఉన్న కిలేడీ జాయ్ జమీమా అలాంటి వ్యక్తి కాదంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను బాధిత కుటుంబం ఖండించింది. జాయ్ జమీమా తమ కుమారుడి(ఎన్‌ఆర్ఐ)ని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని బాధితుడి తల్లి లక్ష్మి ఆరోపించింది.

Visakha: జాయ్ జమీమా.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బాధితుడి తల్లి..

విశాఖ: హనీ ట్రాప్ కేసులో అరస్టయ్యి జైల్లో ఉన్న కిలేడీ జాయ్ జమీమా అలాంటి వ్యక్తి కాదంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను బాధిత కుటుంబం ఖండించింది. జాయ్ జమీమా తమ కుమారుడి(ఎన్‌ఆర్ఐ)ని తీవ్ర ఇబ్బందులు పెట్టిందని బాధితుడి తల్లి లక్ష్మి ఆరోపించింది. తాము చేసే బిజినెస్‌ను ప్రోమోట్ చేస్తానని జాయ్ జమీమా మెుదట వచ్చిందని, ఆ తర్వాత బిజినెస్ మెుత్తాన్ని అప్పజెప్పాలంటూ తమపై ఒత్తిడి తెచ్చినట్లు లక్ష్మి వెల్లడించింది. మాయమాటలు చెప్పి తమ కుమారుడికి, తమకి మధ్య గ్యాప్ పెచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమకు తెలియకుండానే అమెరికా నుంచి అతడిని బలవంతంగా రప్పించిందని లక్ష్మి చెప్పారు.


అనంతరం విశాఖలోని ఓ హోటల్‌లో ఉంచిందని ఆమె బోరున విలపించింది. ఆ తర్వాత అతనికి క్యారెట్, పైన్యాపిల్ వంటి జ్యూసుల్లో మత్తు మందు కలిపి ఇచ్చి మత్తులోనే ఉంచిందని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమారుడిని హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాలకు తీసుకువెళ్లిందని, జాయ్ జమీమా పెడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తమ కుమారుడు వాయిస్ మెస్సేజ్ ద్వారా తెలియజేసేవాడని లక్ష్మి వెల్లడించింది. చాలా రోజుల తర్వాత పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లోనే అతడిని చూశామని ఆమె వెల్లడించింది.


జాయ్ జమీమా ఏ తప్పూ చేయలేదని కొందరు అనడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ చాలా సహాయం చేశారని, నిందితురాలిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయని లక్ష్మి చెప్పారు. జాయ్ జమీమా బాధితులు చాలా మందే ఉన్నారని, పరువు పోతుందని ఎవ్వరూ బయటకు రావడం లేదని బాధితుడి తల్లి లక్ష్మి ఆరోపించారు.


అసలు ఎవరీ జాయ్ జమీమా..

సంపన్నులే లక్ష్యంగా మాయలేడి జాయ్ జమీమా మోసాలకు పాల్పడింది. ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో పలువురు యువకుల నుంచి లక్షలు కొట్టేసేందుకు పథకాలు రచించింది. వారికి మత్తుమందు అలవాటు చేసి బానిసలుగా మార్చింది. వారి కుటుంబంపై వారే తిరగబడేలా రెచ్చగొట్టింది. ముందు సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుంటుంది. ఆ తర్వాత మెసేజ్‌లతో టెంప్ట్ చేస్తుంది. కలవాలని కోరుతుంది. ఆమె మాటలకు మోసపోయి వెళ్లే వారిని గుల్ల చేస్తుంది. ఈ మేరకు మోసపోయిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా జాయ్ జమీమా మోసాలు ఒక్కొక్కటికిగా వెలుగులోకి వచ్చాయి.


విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన జాయ్ జమీమా ఓ ముఠాతో చేతులు కలిపిందని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. సోషల్ మీడియాలో అందమైన ఫొటోలు పెట్టి సంపన్నులు, విదేశాల్లో సెటిలైన యువకులను ఆకర్షిస్తుందని సీపీ చెప్పారు. అనంతరం పరిచయం పెంచుకుని ఒంటరిగా కలుస్తుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత మత్తు పదార్థాలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్న తర్వాత వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ముఠా సభ్యులు తీస్తారని సీపీ వెల్లడించారు. వాటిని చూపించి లక్షలు వసూలు చేస్తారని సీపీ తెలిపారు. అలా పలువురి నుంచి ఈ ముఠా డబ్బులు వసూలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ విధంగా మోసపోయిన ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఆమెను అక్టోబర్ నెలలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై నాలుగు కేసులు నమోదు చేశారు. జాయ్ జమీమా ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది.

Updated Date - Dec 10 , 2024 | 05:30 PM