కైలాసగిరిపై నేచర్ కాటేజీల టెండర్ల రద్దు
ABN , Publish Date - Mar 18 , 2025 | 01:39 AM
కైలాసగిరిపై నేచర్ కాటేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేశామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు.

అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనవద్దు
నెలాఖరులోగా మల్టీలెవెల్ కారు పార్కింగ్, బీచ్‌రోడ్డులో సీ హారియర్
మ్యూజియం ప్రారంభం
వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిపై నేచర్ కాటేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేశామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. వీఎంఆర్‌డీఏ తొమ్మిదో అంతస్థులో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరంలో కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. నేచర్ కాటేజీలపై కోర్టు కేసులు ఉన్నాయని, అందువల్ల టెండర్లను రద్దు చేశామని వివరించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌లో ప్రైవేటు లేఅవుట్ల ప్లాట్ల సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల అనధికార లేఅవుట్లలో తక్కువ ధరకు ప్లాట్లు వచ్చినా కొనుగోలు చేయవద్దని సూచించారు. వీఎంఆర్‌డీఏ ఎన్‌టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్పుల్లో తక్కువ ధరకే ప్లాట్లను అందిస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ల సూచనల మేరకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వీఎంఆర్‌డీఏ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. సిరిపురంలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం, బీచ్ రోడ్డులో సీ హ్యారియర్ హెలికాప్టర్ మ్యూజియం ఈ నెలాఖరుకల్లా సీఎం చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభిస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేలోగా ప్రతిపాదించిన 15 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.
అనకాపల్లి జిల్లాలో రూ.175 కోట్ల విలువైన భూమి
గత ప్రభుత్వ హయాంలో పేదల కాలనీల అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ నుంచి రూ.175 కోట్లు ఖర్చు చేశామని, వాటి విలువకు సమానమైన భూమిని అనకాపల్లి జిల్లాలో ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం అక్కడి కలెక్టర్‌ను ఆదేశించిందని కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో సహకరించినందుకు రూ.790 కోట్ల విలువైన భూములను విశాఖ కలెక్టర్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే రూ.600 కోట్ల భూమిని ఇచ్చారన్నారు. ఆదాయం పెంచుకోవడానికి ప్లాట్ల వేలం ప్రక్రియ చేపట్టామన్నారు. మాస్టర్ ప్లాన్‌పై గతంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, కొత్తగా అభ్యంతరాలను ఏప్రిల్ నుంచి స్వీకరిస్తామని, త్వరలో పారదర్శకమైన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని కమిషనర్ విశ్వనాథన్ చెప్పారు. సముద్ర తీరం కోత నివారణకు కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపడతామన్నారు. కొన్నిచోట్ల రక్షణ గోడల నిర్మాణం, 22 ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపడతామన్నారు.
కిరండూల్ రైలు అరకులోయ వరకే
విశాఖపట్నం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు డివిజన్ పరిధిలోని దార్లిపుట్, పాడువ స్టేషన్ల మధ్య ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టనున్న నేపఽథ్యంలో విశాఖ-కిరండూల్ మధ్య (58501, 58502 నంబర్లతో ఇరువైపులా) నడిచే పాసింజర్ రైళ్లు ఏప్రిల్ 2 నుంచి 10వ తేదీ మధ్య అరకులోయ వరకూ వెళతాయని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. అరకు-కిరండూల్ మధ్య రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.