వైసీపీకి బిగ్ షాక్
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:55 AM
వైసీపీలో అరాచకాలు, అక్రమాలు, అవమానాలు తట్టుకోలేకే నాయకులు సైతం వలస వస్తున్నారని కైకలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు.

కైకలూరు, ఏప్రిల్ 15: వైసీపీలో అరాచకాలు, అక్రమాలు, అవమానాలు తట్టుకోలేకే నాయకులు సైతం వలస వస్తున్నారని కైకలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం కైకలూరులో వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు కురేళ్ళ బేబి, రాచపట్నం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పాట్రిక్ పాల్ కామినేని శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కురేళ్ళ బేబి మాట్లాడుతూ సొంత సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచామని మూడేళ్లుగా వైసీపీలో తమకు ఎలాంటి గుర్తింపు లేదని ప్రొటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలపై వేయాల్సిన ఫోటోలు సైతం తీసివేసి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారుల ఫోటోలు వేసుకున్నారన్నారు. ఎస్సీ మహిళ నని కూడా చూడకుండా అడుగడుగునా అవమానాలకు గురిచేశారన్నారు. గుర్తింపు లేని పార్టీలో ఉండలేకే టీడీపీలోకి వచ్చానని, ఎన్నికల్లో కామినేని, పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ గెలుపునకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, వడ్డి సాధికార సమితి కన్వీనర్ బలే ఏసురాజు, పార్టీ మండల అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.