వేపచెట్టు కింద కూల్ కూల్‌గా..
ABN , Publish Date - May 30 , 2024 | 11:48 PM
ప్రస్తుతం రోహిణీ కార్తె, రోళ్లు పగిలేలా ఎండలు వడగాల్పులకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ ఆ వేప చెట్టు కిందకు వెళితే చాలు వేసవి తాపం నుంచి కొద్ది సేపట్లోనే ఉపశమనం పొందవచ్చు.

వేపచెట్టు కింద
కూల్ కూల్‌గా..
చాట్రాయి, మే 30: ప్రస్తుతం రోహిణీ కార్తె, రోళ్లు పగిలేలా ఎండలు వడగాల్పులకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ ఆ వేప చెట్టు కిందకు వెళితే చాలు వేసవి తాపం నుంచి కొద్ది సేపట్లోనే ఉపశమనం పొందవచ్చు. అపర భద్రాద్రి గా పేరుగాంచిన మండలంలోని చనుబండ సెంటర్‌లో ఉన్న భారీ వేప వృక్షం నిప్పుల కొలిమిలాంటి ఎండల్లో ప్రజలకు, ప్రయాణికులకు చల్లని నీడనిస్తోంది. ఆంధ్ర–తెలంగాణ రహదారి(విజయవాడ–సత్తుపల్లి రోడ్డు) పక్కనే ఈ వేపచెట్టు ఉంది. సుమారు అర ఎకరం స్థలంలో విస్తరించి ఉన్న ఈ చెట్టు కింద సత్యనారాయణస్వామి ఆలయం, గ్రామ దేవత గుడి ఉన్నాయి. కొమ్మలు నేలకు దిగి గొడుగు ఆకారంలో ఉండటం వలన, తీవ్రమైన ఎండలు వడగాల్పులు సైతం వేప చెట్టు దరిచేరవు. పలువురు చిరు వ్యాపారులు ఈ చెట్టు కింద పండ్ల, శీతల పానీయాల, పాన్ దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేసుకొని జీవనం చేస్తున్నారు. ఇటుగా ప్రయాణించే వారు వాహనాలు ఆపి కొద్దిసేపు వేప చెట్టు నీడను ఆస్వాధించి మరీ వెళుతుంటారు. కొన్ని తరాల నుంచి వారసత్వ సంపదగా ఉన్న ఈ వేప వృక్షాన్ని గ్రామస్తులు దైవంగా భావిస్తూ సంరక్షించుకుంటున్నారు.