YSRCP: వైసీపీకి గుడ్ బై చెప్పిన మరో నేత.. ఇంతకీ ఏం జరుగుతోంది..
ABN, Publish Date - Dec 12 , 2024 | 04:09 PM
ప.గో. జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం ఫ్యాన్ పార్టీకి రాజీమానా చేశారు. వైసీపీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు లేఖను అధిష్ఠానానికి పంపించారు.
భీమవరం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు భారీ షాక్‌లు తగిలాయి. ఇవాళ (గురువారం) ఒక్కరోజే ఇద్దరు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. భీమిని మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఇవాళ ఉదయం ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ప.గో. జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం ఫ్యాన్ పార్టీకి రాజీమానా చేశారు. వైసీపీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు లేఖను అధిష్ఠానానికి పంపించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ తీరుపై గ్రంధి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఒకే రోజు ఇద్దరు నేతలు వైసీపీకి రాజీమానా చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.
గ్రంధి ఏం చెప్పారంటే..
వైసీపీకి రాజీనామా అనంతరం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీ, జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంధి మాట్లాడుతూ.. " గత నెలలో జగన్‌ను కలిసినప్పుడు మే నెల వరకూ పార్టీ కార్యక్రమాలకు సమయం ఇవ్వమని అడిగా. ఆయన దగ్గర ఉండగానే నాపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఆ టైమ్‌లో చిన్న పాటి ధైర్యం చెప్తారని అనుకున్నా. అలా చెప్పకుండా పోరాటం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి, అధికారంలోకి రావాలని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారనే సానుకూల దృక్పథంతో ఆయన ఉన్నట్లు నాకు అనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పగించారు. పార్టీలో నాకు ఏవిధమైన సముచిత స్థానం కలిపించారనేది ప్రజలకు తెలుసు. పార్టీ నాయకులు, కార్యకర్తలను బానిసల్లాగా చూశారు. ఇచ్చే కార్యక్రమం సాధ్యమా, సాధ్యం కాదా అని ఆలోచించకుండా చేపట్టారు. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చెయ్యలేరని జగన్ మోహన్ రెడ్డే చెప్పారు. అమలు చెయ్యలేరని చెప్పిన ఆయన అమలు చేయమని ఎలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కార్యకర్తలకు విలువే లేకుండా పోయింది. నన్న ప్రజలు గెలిపించారు. నా కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో సంప్రదించి ఎక్కడ గౌరవం ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటా" అని చెప్పారు.
ఇదే బాటలో..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో అప్పటివరకూ రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా సైలెంట్ అవ్వడం మెుదలుపెట్టారు. చాలా మంది ముఖ్య నేతలు ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతూ వరస షాక్‌లు ఇస్తున్నారు. అయితే కూటమి విజయం సాధించిన తర్వాత కొన్నాళ్లపాటు వైసీపీకి రాజీనామాల పర్వం కొనసాగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ నేతలు వరసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అయితే వీరంతా కూటమిలోని ఏదో ఓ పార్టీలో చేరేందుకు మెుగ్గుచూపుతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో మరికొంతమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలూ రాజీనామా చేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు.
Updated Date - Dec 12 , 2024 | 04:23 PM