Share News

Cybercriminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..

ABN , Publish Date - Nov 12 , 2024 | 08:59 AM

పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్‌ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్‌ చేస్తున్నారు.

Cybercriminals: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కాజేసిన డబ్బు అమాయకుల ఖాతాలకు..

- చిన్న మొత్తాలుగా బదిలీ

- పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు

- ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాధితులు

హైదరాబాద్‌ సిటీ: పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్‌ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్‌ చేస్తున్నారు. దాంతో సైబర్‌ నేరగాళ్ల ఖాతాలతోపాటు పలు సంస్థలకు చెందిన ఖాతాలు, అమాయకుల ఖాతాలు కూడా ఫ్రీజ్‌ అవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘ఈవెనింగ్‌ బీటెక్‌’కు అరకొరగానే అడ్మిషన్లు


ఆయా సంస్థల ప్రతినిధులు పోలీసు అధికారులను సంప్రదించి తమ ఖాతాలను పునరుద్ధరించుకోగా.. అమాయకులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి పోలీస్‌స్టేషన్‌లు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు సైబర్‌ నేరగాళ్లు, ఎవరు బాధితులు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. బాధితులు తాము సైబర్‌ నేరగాళ్లకు సహకరించడంలేదని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.


ఖాతాలు మార్చి.. ఏమార్చి

కాజేసిన డబ్బును సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసిన ఖాతాల్లో డిపాజిట్‌ చేయుంచుకుంటారు. వీటిని లేయర్‌ 1 ఖాతాలంటారు. ఈ ఖాతాల నుంచి చిన్న చిన్న మొత్తాన్ని పలు బ్యాంక్‌ ఖాతాలకు(లేయర్‌ 2)బదిలీ చేస్తారు. తర్వాత ఈ మొత్తాలను మరికొన్ని ఖాతాలకు (లేయర్‌ 3) బదిలీ చేస్తారు. ఇలా చిన్న చిన్న మొత్తాలుగా విభజించి ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, క్రిప్టో కరెన్సీకి మార్చి.. విదేశాల్లో ఉన్న కింగ్‌పిన్‌లకు పంపుతారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ఖాతాలను కూడా ఫ్రీజ్‌ చేస్తున్నారు.


city5.2.jpg

ఈ విషయం గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు లేయర్‌ 2 ఖాతాల నుంచి చిన్న మొత్తాలతో పెట్రోల్‌, మాల్స్‌లో, చిన్న చిన్న దుకాణాల్లో కొనుగోళ్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి రూ. 800 నుంచి రూ. 70 వరకు బదిలీ చేస్తున్నారు. దీంతో తమ ఖాతా ఎందుకు ఫ్రీజ్‌ అయిందో తెలియక అమాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఖాతా ఫ్రీజ్‌ కావడంతో ఆస్పత్రి ఖర్చు, శుభకార్యాలకు సమయానికి డబ్బులేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్‌ ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి కోర్టుకు సైతం వెళ్తున్నారు.


రూ. 800 బదిలీ.. ఖాతా ఫ్రీజ్‌

లూథియానాకు చెందిన సైనీ అనే వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాళ్లు స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో కోటి రూపాయలు కాజేసి ఎల్‌-2 ఖాతాకు బదిలీ చేశారు. ఎల్‌-2 ఖాతా నుంచి రూ. 800 వెచ్చించి కొనుగోళ్లు చేయడంతో ఈ డబ్బు పేమెంట్‌ గేట్‌వే ద్వారా వ్యాపారి ఖాతాకు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా ఈ ఖాతాను కూడా పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. సంస్థ నిర్వాహకుల వివరణతో సంతృప్తి చెందిన అధికారులు బ్యాంక్‌ ఖాతాను అన్‌ఫ్రీజ్‌ చేశారు.


మరో కేసులో.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని చెప్పిన సైబర్‌నేరగాళ్లు ఢిల్లీకి చెందిన సాహిల్‌ నుంచి రూ. 27 వేలు కాజేశారు. ఈ మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లు గేమింగ్‌ యాప్‌లో పెట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గేమింగ్‌ యాప్‌ బ్యాంక్‌ ఖాతాను సీజ్‌ చేశారు. గేమింగ్‌ యాప్‌ సంస్థ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన రూ.27వేలు మినహాయించుకొని, బ్యాంక్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు.


డబ్బు మాత్రమే ఫ్రీజ్‌ చేయాలి

సైబర్‌ నేరగాళ్లు పోలీసుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చిన్న చిన్న మొత్తాల్లో పెట్రోల్‌ బంకుల్లో, షాపింగ్‌ మాల్స్‌లో, చిన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ఖాతాలను కూడా ఫ్రీజ్‌ చేస్తున్నారు. చెన్నై కోర్టు ఆదేశాల ప్రకారం ఏదైనా బ్యాంక్‌ ఖాతాలో అనుమానాస్పదంగా డబ్బు జమ అయితే ఆ డబ్బును మాత్రమే ఫ్రీజ్‌ చేసి, ఖాతా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలి.

- పాటిబండ్ల ప్రసాద్‌, సైబర్‌ నిపుణుడు


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు... ఏం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: TG News: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఈవార్తను కూడా చదవండి: Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2024 | 08:59 AM