Share News

Woman Loses 20 Crore: వృద్ధురాలికి భారీ షాక్.. ఏకంగా రూ. 20 కోట్ల దోపిడీ

ABN , Publish Date - Mar 17 , 2025 | 06:15 PM

ముంబైకి చెందిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.20 కోట్లు పోగొట్టుకున్నారు. ఆధార్ కార్డు దుర్వినియోగమైన కారణంగా కేసు పెట్టినట్టు బెదిరించి విడతల వారీగా ఆమె నుంచి భారీగా డబ్బు బదలాయించుకున్నారు.

Woman Loses 20 Crore: వృద్ధురాలికి భారీ షాక్.. ఏకంగా రూ. 20 కోట్ల దోపిడీ

సైబర్ స్కామ్‌లో చిక్కుకున్న ఓ ముంబై వద్ధురాలు ఏకంగా రూ.20 కోట్లు నష్ట పోయారు. బాధితురాలి ఆధార్ కార్డు దుర్వినియోగమైందని భయపెట్టిన నిందితులు ఆమెను డిజిటల్ అరెస్టు పేరిట ఎవరి సాయం కోరకుండా నిదర్బంధించి కోట్లు దోచుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం స్థానికంగా సంచలనానికి దారితీసింది. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ స్కామ్ పూర్తి వివరాల్లోకి వెళితే..

జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిందితులు వృద్ధురాలిని (86) భయపెట్టి గతేడాది డిసెంబర్ 26 మొదలు ఈ ఏడాది మార్చి 3 వరకూ పలు దశల్లో మొత్తం రూ20.25 కోట్లు తమ అకౌంట్లల్లోకి బదిలీ చేయించుకున్నారు. తొలుత బాధితురాలికి ఓ వ్యక్తి ఫో్ చేసిన తనను తాను పోలీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ కార్డు పేరిట ఎవరో బ్యాంక్ అకౌంట్‌ తెరిచి అక్రమ నగదు బదిలీలకు పాల్పడ్డారని చెప్పారు.


Also Read: నగలు తిరిగిమ్మన్నాడని.. మాజీ ప్రియుడికి బలవంతంగా విషం తాగించి..

అక్రమకార్యకలాపాలు, నగదు అక్రమరవాణాకు ఆమె ఆధార్ కార్డు వినియగించారని భయపెట్టారు. ఫలితంగా వృద్ధురాలిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ కేసులో ఆమె బంధువులు కూతురు కూడా ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కేసు దర్యాప్తు జరుగుతున్నందున ఈ వివరాలు ఎవరికీ చెప్పొద్దంటూ డిజిటల్ అరెస్టు పేరిట ఆమెను అష్ఠదిగ్బంధనం చేశారు. ఈ కేసు నుంచి విముక్తి కలగాలంటే డబ్బు చెల్లించాలంటూ ఆమె నుంచి పలు దఫాలుగా వివిధ అకౌంట్లకు కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయానని అర్థం చేసుకున్న వృద్ధురాలు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు జరిపిన నగదు బదిలీల ఆధారంగా నిందితుల జాడ కనుక్కుని అరెస్టు చేసినట్టు తెలిసింది. ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది.


Also Read: బెంగళూరులో షాకింగ్ ఘటన.. వృద్ధులపై చేయి చేసుకున్న డాక్టర్ కోడలు..

ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పోలీసులు లేదా యూఐడీఏఐ అధికారులు ఎప్పుడూ నగదు పౌరులకు ఫోన్లు చేసి వ్యక్తిగత వివరాలు అడగరని చెప్పారు. ఓటీపీలు, ఇతర వ్యక్తిగత వివరాలు కోరుతూ ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే యూఐడీఏఐ టాల్ ఫ్రీ నెంబర్‌ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాలేవీ చెప్పొద్దని అన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2025 | 06:16 PM