Pune: పుణెలో ఒకేరోజు ముగ్గురిపై సామూహిక అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటనలు..
ABN, Publish Date - Oct 04 , 2024 | 06:54 PM
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
పుణె: దేశంలో ప్రతి రోజూ ఏదో ఓ మూలన మహిళలు, చిన్నారులపై అత్యాచారం, హత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి ఘటనలపై ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నా.. కామాంధుల్లో మాత్రం ఎలాంటి భయం కలగడం లేదు. ఆడవాళ్లు కనపడితే చాలు పేట్రేగి పోతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మరవక ముందే అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటివే పుణెలో చోటు చేసుకున్నాయి. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన అత్యాచారాలు నగరాన్ని హడలెత్తిస్తున్నాయి.
యువతిపై ముగ్గురు అత్యాచారం..
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది. అయితే అదే ప్రాంతంలో మాటు వేసిన ముగ్గురు కామాంధులు.. యువతిపై కన్నేశారు. వీరిని గమనించి ఒక్కసారిగా వెనక నుంచి దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచగా.. అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యారు. నిర్మానుష్య ప్రాంతం, పైగా అర్ధరాత్రి కావడంతో వీరి దాష్టికాన్ని ఆపేందుకు ఎవరూ లేరు.
దాడి నుంచి కోలుకున్న బాధితులిద్దరూ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతీయువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిర్మానుష్య ప్రాంతం కావడంతో దుండగుల ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారిందని పుణె పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారం ఆధారంగా విచారణ వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.
చిన్నారులపై అత్యాచారం..
మరోవైపు పుణెలో ఇద్దరు బాలికలపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఆరేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు రోజూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు. అయితే అదే క్రమంలో వారిపై కన్నేసిన సంజయ్ అనే డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో తమపై అత్యాచారం చేశాడని చిన్నారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీనిపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పుణె పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. అయితే ఎవరైనా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పుణె పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Updated Date - Oct 04 , 2024 | 10:15 PM