Lord Krishna: కోరమీసాల శ్రీకృష్ణుడు.. ఆ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా?
ABN, Publish Date - Aug 27 , 2024 | 12:50 PM
సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ధరించి సుందరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన రూపంలో ఆయన కనువిందు చేస్తున్నారు.
సిద్దిపేట: సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ధరించి సుందరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన రూపంలో ఆయన కనువిందు చేస్తున్నారు. ఏ పురాణ ఇతిహాసాల్లోనూ లేని విధంగా చెల్లాపూర్‌లో శ్రీకృష్ణుడు కోరమీసాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అసలు కృష్ణయ్యకు మీసాలు ఏంటి అని అనుకుంటున్నారా?. దానికి పెద్ద స్టోరీనే ఉందంటూ గ్రామస్తులు చెప్తున్నారు.
చెల్లాపూర్ గ్రామం పూర్వం రాజుల పరిపాలనలో ఉండేది. అయితే అప్పట్లో రాజులు శిస్తులు కట్టాలంటూ అక్కడి ప్రజల్ని వేధిస్తుండడంతో వారంతా బతుకుజీవుడా అంటూ కాలం గడిపేవారు. దీంతో తమ గ్రామానికి మంచి జరగాలని భావించిన గ్రామస్థులు.. ఒక ఆలయాన్ని నిర్మించారు. అయితే దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు డబ్బులు లేని వారంతా.. ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. గ్రామ పెద్దలు కొంతమంది దేవుని విగ్రహం కోసం వెతగ్గా.. ఆ సమయంలో నంగునూరు మండలం రాజగోపాలపేట ఊరి చివర పాడుబడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించింది. రాత్రిపూట దాన్ని దొంగిలించి ఎడ్లబండ్లపై తీసుకువచ్చి చెల్లాపూర్ పక్కన చెరువులో దాచి పెట్టారు. దీంతో అప్పట్నుంచి ఆ చెరువు పేరు కృష్ణమ్మ చెరువుగా మారిపోయింది.
విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే రాజగోపాలపేట గ్రామస్థులు గుర్తుపడతారని భావించిన చెల్లాపూర్ వాసులు.. ఆ కన్నయ్యకు కోరమీసాలు అలంకరించారు. అంతేకాక ఈ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడే దీపం వెలిగించారు. ఆ దీపాన్నే నందా దీపంగా గ్రామస్థులంతా పిలుస్తున్నారు. ఇక కృష్ణుడి విగ్రహాన్ని దాచిపెట్టిన కోనేరు నుంచి తీసుకొచ్చిన నీటితో ప్రతీరోజు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ కోరమీసాల శ్రీకృష్ణుణ్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. లేని మీసాలు పెట్టి కృష్ణుడిని మీసాల కన్నయ్యగా మార్చిన ఘనత తమకే దక్కుతుందని చెల్లాపూర్ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Aug 27 , 2024 | 12:50 PM