Share News

తరం తరం ఒక కొత్త చరిత్ర

ABN , Publish Date - Nov 28 , 2024 | 05:31 AM

మనకు తెలిసినదే వాస్తవమని, ఆ తెలిసిన దానిలో మనకు నచ్చినదే జీవిత సత్యమని నమ్మే భావన ఒక సామాజిక అవగాహనగా దాదాపు మనందరిలోనూ స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ భావనలు పాక్షికమైనవి...

తరం తరం ఒక కొత్త చరిత్ర

మనకు తెలిసినదే వాస్తవమని, ఆ తెలిసిన దానిలో మనకు నచ్చినదే జీవిత సత్యమని నమ్మే భావన ఒక సామాజిక అవగాహనగా దాదాపు మనందరిలోనూ స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ భావనలు పాక్షికమైనవి. వాస్తవానికి భిన్నమైనవి. ప్రతి అంశానికి విరుద్ధమైన పూర్తి వ్యతిరేకమైన అంశం మరొకటి వుండి తీరుతుంది. ఈ నియమం జీవరాశులకు మాత్రమే కాక, మనం సాధారణంగా నిర్జీవరాశులుగా భావించే రాళ్ళు, రప్పలు, ఖనిజాలు, యంత్రాలకు కూడ వర్తిస్తుంది. ప్రపంచంలో ప్రతీదీ నిరంతరం విరుద్ధ అంశాల పరస్పర సంఘర్షణ (dialectics)లోనే ముందుకు సాగుతుంటుంది.

చరిత్ర గమనాన్ని అవగాహన చేసుకునేందుకు మనకు అనేక పనిముట్లు అందుబాటులో వున్నాయి. అసలు పనిముట్ల ఆధారంగానే మానవ చరిత్రను వివరించే విధానం ఒకటుంది. పాత రాతియుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతియుగం, కంచు యుగం, ఇనుము యుగం, పురాతన యుగం, మధ్య యుగం మొదలుకుని ఇప్పటి డిజిటల్, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వరకు పనిముట్ల వినియోగం ఆధారంగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని వివరించవచ్చు. రాజులు, చక్రవర్తులు... వాళ్ళ కులమతాలు, అనుసరించిన పరిపాలనా విధానాల ద్వారా కూడ చరిత్రను వివరించే పద్ధతులు కొన్ని ఉన్నాయి.


చరిత్ర అంటే గతం అనుకుంటాం; నిజానికి అది వర్తమానం కూడ కాదు; భవిష్యత్తు!. భవిష్యత్తును నిర్మించుకునే లక్ష్యంతోనే మనిషి గతం నుండి కొన్ని అనుభవాలను, పరికరాలను ఎంచుకుంటాడు. ‘రేపు–నిన్న –రేపు’ అనేది చరిత్ర రచన క్రమానికి సమీకరణం. ప్రతిలోనూ మంచీ వుంటుంది; చెడూ వుంటుంది. భావి రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం గత చరిత్రను వక్రీకరించే పద్ధతులు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్యయుగాల్లో ముస్లిం పరిపాలకులు హిందువులను హింసించారని ఒక అభియోగాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి, ఇప్పుడు ముస్లింలను రాజకీయార్థిక సాంస్కృతిక రంగాల్లో హింసించి ప్రతీకారం తీసుకుంటామని శపథాలు చేస్తే ఓటర్లలో ఓ మూడవ భాగమైనా ఉత్తేజితులై బలపరుస్తారు. అలా అధికారం సులువుగా దక్కుతుందనేది ఆధునిక రాజకీయార్థిక చరిత్ర రచన ఫార్మూలా. మూడవ భాగం అనేది అల్పసంఖ్య. అయితేనేం? మల్టీపార్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మూడవ భాగం ఓట్లు మాత్రమే వచ్చినా సరే తిరుగులేని విజయం అని చెప్పుకునే అవకాశం వుంది.

‘చరిత్ర తనంతతానుగా పునరావృతం అవుతుంది; మొదటిసారి విషాదంగానూ, రెండోసారి ప్రహసనంగానూ’ (History repeats itself, first as a tragedy, second as a farce.) అన్న కార్ల్ మార్క్స్ వ్యాఖ్య చాలామందికి తెలుసు. ఆయన చరిత్ర గురించి ఇంకా చాలా చాలా అన్నాడు. పునరావృతం అవ్వడం అంటే జరిగిన సంఘటనలే సరిగ్గా అలాగే మళ్ళీమళ్ళీ జరుగుతాయని కాదు; వాటి స్థాయీ పెరుగుతుందన్నాడు. సంఘటనలు గతానికి విరుద్ధంగా పునరావృతం అవుతాయనే అర్థమూ అందులో వుంది.


వలస పాలన కాలం ఎలావున్నా ఆధునిక చారిత్రిక ఘటనలకు అనివార్యంగా రాజ్యాంగంతోనూ, కొత్త చట్టాలతోనూ ఒక సంబంధం వుంటుంది. రాజ్యాంగం మీద ఒక్కో చారిత్రక సందర్భంలో ఒక్కో అభిప్రాయం వెలువడుతూ వుంటుంది. ఇవి పరస్పరం వ్యతిరేకంగానూ వుంటాయి. రాజ్యాంగసభను బ్రిటీష్ పాలకులే ఎర్పాటు చేశారు కనుక అది వలస రాజ్యాంగం అనేవారున్నారు. భారత రాజ్యాంగం గొప్ప ప్రజాస్వామికమైనది అనే వారున్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అది సామ్యవాదాన్ని ఆకాంక్షిస్తుంది అంటుంటారు. దాన్ని పెట్టుబడిదారుల రాజ్యాంగం అనేవారూ వున్నారు. రాజ్యాంగ రచనే ఒక కుట్ర అన్నవారూ వున్నారు. ఎమర్జెన్సీని మించిన క్రూరమైన చట్టాలతో పీడిత ప్రజల్ని నిరంతరం పరమ కిరాతకంగా చంపేయడానికి రాజ్యాంగం దోహదపడుతుందనేవారూ వున్నారు. రాజ్యాంగం గాంధీజీ– అంబేడ్కర్‌ల మార్గంలో అహింసను ప్రోత్సహిస్తుంది అనేవారున్నారు. ‘దేవతలు నివసించడానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ ఆలయాన్ని నాశనం చేయడం తప్ప మనం ఏమి చేయగలం?’ అని ఓ సందర్భంలో అంబేడ్కర్‌ వాపోయారు. రాజ్యాంగానికి ఎంత చెదపట్టినాసరే ఇప్పటికి అదే మనకు గతి అనేవారూ వున్నారు. సామాజికార్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు సాయుధులై తిరగబడతారని అంబేడ్కర్ ఎలాగూ హెచ్చరించాడు. రాజ్యాంగం అంటే రాజ్యపు అంగం అనేది నిఘంటువు అర్ధం. రాజ్యం అంగి; రాజ్యాంగం దాని అంగం.


ప్రజల ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాల ఆధారంగా ఇటు సమాజంలో అటు ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పుల్ని వివరించడం చరిత్ర రచనలో ఇంకో పద్ధతి. అయితే ఇందులో కూడ ఒక తిరకాసు వుంది. ప్రజాందోళనలు సాధించిన విజయాలు కూడ ఒక దశ తరువాత తిరుగుముఖం పడతాయి.

ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లలో రాచరిక – భూస్వామ్య వ్యవస్థ మీద పెట్టుబడిదారులు ప్రాణాలొడ్డి పోరాడారు. మన దేశంలో రాచరిక – భూస్వామ్య వ్యవస్థ మీద కొన్నిచోట్ల కమ్యూనిస్టులు ప్రాణాలొడ్డి పోరాడారు. మన భూస్వాములు యూరోపియన్‌ భూస్వాములకన్నా బాగా తెలివైనవారు. పెట్టుబడిదారులతో తలపడితే తమ పతనం తప్పదని తెలుసుకుని వాళ్ళే పెట్టుబడిదారులైపోయారు. ఈ పరిణామాన్ని రాజ్యాంగ సభలోనే చూడవచ్చు. సభ్యుల్లో అత్యధికులు రాచరిక – భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధులు. అయినప్పటికీ వారు అత్యంత ఆధునిక రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు.

1970లలో రాజభరణాలు రద్దు, భూపరిమితి చట్టం, బ్యాంకుల జాతీయకరణ, అటవీ భూములపై ఆదివాసులకు ప్రత్యేక హక్కులు వగైరా ప్రజాస్వామిక చట్టాలు వచ్చాయి. ఇవన్నీ నక్సలైట్ సాయుధ పోరాట విస్తరణకు భయపడి రూపొందించిన చట్టాలే. ఆ మేరకు అవి ప్రజా విజయాలే. అయితే, రాజ్యం తన స్వభావాన్ని భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ దిశగా మార్చుకోవాలనుకోవడం కూడ దీనికి మరో కారణం.


తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు భూస్వాములు ముదిరి పెట్టుబడిదారులయ్యారు. పెట్టుబడిదారులు ముదిరి కార్పొరేట్లు అయ్యారు. వాళ్ళు ముదిరి మెగా కార్పొరేట్లయ్యారు. వాళ్ళు తిమింగలాలను మించిపోయారు. బ్లూ వ్హేల్, లివియాథాన్ (Leviathan) వంటివన్నమాట. తెలుగులో తిమింగలగిలం అంటారు. వాళ్ళకిప్పుడు అలనాటి జమిందారులు, జాగీర్దారులు ఆ మాటకొస్తే చక్రవర్తులకు వుండినంత భూమి కావాలి. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మూడు వేల ఎకరాల భూమి కావాలి. స్టీల్ ప్లాంటుకు ముప్పయి వేల ఎకరాలు కావాలి. ఇంకో ప్రాజెక్టుకు మొత్తం నికోబార్ ద్వీపం కావాలి. ఇంకొకరికి మొత్తం మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు కావాలి. వాళ్ళ కోసం అటవీ భూముల పరిరక్షణ చట్టాల్ని పార్లమెంటు సవరిస్తుంది. అలా 1970వ దశాబ్దంలో వచ్చిన ప్రజాస్వామికం అనుకునే చట్టాలన్నీ ఒకదానివెంట మరొకటి రద్దయిపోతాయి. లేదా శవపేటికలో వుండిపోతాయి. ‘Undoing the doing’ అన్నమాట.

ఇవన్నీ దేశాభివృద్ధి పేరిటే జరుగుతాయి. దేశాభివృద్ధి మంత్రం ముందు మరేదీ నిలవదు. ఇంతకీ దేశాభివృద్ధి అంటే ఏమిటీ? ఎవరి నిర్వచనం వారిది. దీపావళికి ముందు బంగారం ధర పెరుగుతుంటుంది. ఆ ఊపులో అవసరానికి మించి పెరిగిపోతుంది. దీపావళి తరువాత ధర తగ్గుముఖం పడుతుంది. ఆ నైరాశ్యంలో అవసరానికి మించి తగ్గిపోతుంది. మళ్ళీ సంక్రాంతికి ధర పెరుగుతుంది. ఈసారి కూడా అవసరానికి మించి పెరుగుతుంది. మళ్ళీ అవసరానికి మించి తగ్గుతుంది. స్టాక్ మార్కెట్‌లో షేర్లు కూడ అంతే. పెరిగేటప్పుడూ అతిశయమే తగ్గేటప్పుడూ అతిశయమే. రాజకీయాలూ అంతే. అతిశయాలతో నిండిపోతాయి. అప్పుడు ‘Undoing the doing’ అనివార్యమైపోతుంది.


కొన్నాళ్ళు వామపక్షమే మేలనిపిస్తుంది. అది అతిశయించినపుడు కుడిపక్షం మేలనిపిస్తుంది. అదీ అతిశయిస్తుంది. అప్పుడు మళ్ళీ వామపక్షమే మేలనిపిస్తుంది. ఈ వృత్తం పూర్తి అయ్యేసరికి పాత వామపక్షమూ వుండదు; పాత కుడిపక్షమూ వుండదు. వాటి మధ్య పాత పోరాట రూపమూ వుండదు. అన్నీ మారిపోతాయి. అన్నింటి స్థాయి పెరిగిపోతుంది. నిలువుగా పైకి ఎగబ్రాకే స్ప్రింగు చుట్టలా స్పైరులాకృతిలో సమాజం ముందుకు సాగిపోతుంటుంది.

ప్రజాస్వామ్య వైఫల్యాల నుండే ఫాసిజం పుడుతుంది. ఫాసిజం అతిశయాల నుండే సమానత్వం పుడుతుంది. ఇవ్వాల్టి ఫాసిజం గత శతాబ్దపు ఫాసిజం కాదు. నిన్న దాటిన మైలురాయి మళ్ళీ ఎదురైనట్టు అనిపిస్తుంది. ఆ మైలురాయి నిన్నటిదికాదు. నిన్నలా దాన్ని దాటడమూ కుదరదు. దానికొక కొత్త పద్ధతి కావాలి. దానికి అవసరమైన కొన్ని సూచనలు మాత్రమే మనకు చరిత్ర నుండి దొరకవచ్చు. వర్తమానానికి కావలసింది సరికొత్త సృజనాత్మకత. అదే చరిత్రను నడుపుతుంది.

ప్లస్సుకు మైనస్సు వ్యతిరేకం అయినట్టు, పగటికి రాత్రి వ్యతిరేకం అయినట్టు కొందరు మెజారిటీ మతతత్త్వానికి విరుగుడు మైనారిటీ మతతత్త్వం అంటుంటారు. సమాజం మరీ ఎలిమెంటరీ స్కూలు లెఖ్ఖలంత ఈజీ కాదని వీళ్ళకు కొంచెం గట్టిగానే చెప్పాలి.

శాంతిదూత బిరుదాంకితులు కావచ్చు, బౌద్ధం శరణం గచ్ఛామి అనొచ్చు మయన్మార్ శ్రీలంక పాలకుల్ని నియంతలు అనకుండా వుండగలమా? ఇరవయ్యవ శతాబ్దపు ఫాసిస్టులు, నాజీయిస్టులు పాటించిన డ్రెస్ కోడ్‌ను ఇరవై ఒకటో శతాబ్దపు ఫాసిస్టులు పాటించరు. ఇండియా జర్మనీని దాటడానికి ఇంకా ఒక్క అడుగే ఉందట. ఎందులో? ఇంకా ఎంతకాలం జార్జి డిమిత్రోవ్, రజిని పామే దత్ నిర్వచనాల్లో మునిగితేలుతుందాం? కొంచెం కొత్త నీళ్ళ కోసం వెతుకుదాం.


ఓ భగత్‌సింగ్, ఓ అల్లూరి, ఓ చారు మజుందార్ మళ్ళీ పుట్టాలి అని కొందరు కవితలు రాస్తుంటారు. భావుకత వరకు అది సరేగానీ, ఇరవయ్యవ శతాబ్దంలో వాడిన ఆయుధాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో పనికిరావు. ఆ ధర్మసూక్ష్మం తెలియడమే చారిత్రక దృష్టి. అది ఇప్పుడు చాలా అవసరం. చరిత్ర అంటే గతంకాదు భవిష్యత్తు. ప్రతి తరం ఒక కొత్త చరిత్ర రాయాల్సిందే.

డానీ

సమాజ విశ్లేషకులు

Updated Date - Nov 28 , 2024 | 05:31 AM