ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

ABN, Publish Date - Jun 09 , 2024 | 03:48 AM

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ‘‘మాకు కేవలం 23 సీట్లు వచ్చాయంటే మేం ప్రజలను అంతగా బాధ పెట్టామా?’’ అని అప్పుడు ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఆత్మపరిశీలన చేసుకునే ప్రయత్నం చేయగా, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి మాత్రం పరనిందకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను ఏమి చేశానో? ఏ లక్ష్యంతో పనిచేశానో? ఆత్మపరిశీలన చేసుకుంటే తనకు 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే రావడానికి గల కారణాలు జగన్‌కు ఇట్టే తెలిసిపోతాయి. ప్రజలు తనను మోసం చేశారనే భావన ఆయన మాటల్లో ధ్వనించింది. ఈ దేశంలో ప్రజలెవ్వరూ రాజకీయ నాయకులను మోసం చెయ్యలేరు. నాయకులే అధికార పీఠాలు ఎక్కాక ప్రజలను వంచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్‌ దేశానికే అద్భుత సందేశాన్ని ఇచ్చారు. పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి ఎంచుకున్న మోడల్‌ భావి తరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైనదో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు. పాలకుడిగా తమ బాధ్యతను విస్మరించి సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పంచిపెడుతూ తమ అధికారానికి తిరుగు ఉండదని భావించే వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు అమాయకంగా ముఖం పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్‌... ఆ తర్వాత తమను మోసం చేశారని ఆయన చర్యల ద్వారా ప్రజలు గ్రహించారు. వంచనతో కూడిన రాజకీయాలు చేసే వారికి ఏ దుస్థితి ఎదురవుతుందో స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అనేవాడు బటన్లు నొక్కడానికే పరిమితం కాకూడదని, రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపారు. కేవలం సంక్షేమం లేదా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి విషయంలో రుజువైంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్‌గుడ్‌ భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్లీ మళ్లీ అధికారంలోకి వస్తారు. ఆ విషయం విస్మరించి సోషల్‌ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకొనో, ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకొనో పబ్బం గడుపుకోవాలంటే కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ విషయంలో ప్రజలు రుజువు చేశారు. ఆత్మస్తుతి, పరనింద వల్ల ప్రయోజనం ఉండదు. ఐదేళ్లలో రెండు లక్షలా 70 వేల కోట్ల రూపాయలు పంచిపెట్టినా తనకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అని జగన్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. సొంత సొమ్ము ఖర్చు చేసినవారు ఆవేదన చెందారంటే అర్థం చేసుకోవచ్చు. అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెట్టడం అనర్థమని గ్రహించకపోతే ఎలా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ప్రజా వేదిక’ను కూల్చడం ద్వారా తన మనస్తత్వం ఏమిటో జగన్‌రెడ్డి చాటి చెప్పారు. అప్పుడే అతని పతనం ప్రారంభమైంది. విద్వేషాల వల్ల తాత్కాలిక ప్రయోజనం కలగవచ్చునుగానీ అంతిమంగా నష్టమే జరుగుతుందని ఆయన తెలుసుకోలేదు.


ఏది మంచి... ఏది చెడు?

జగన్‌ మాత్రమే కాదు– ఆయనను సమర్థించే వాళ్లు కూడా ప్రజల తీర్పు పరమార్థాన్ని గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ‘పేదలందరికీ జగన్‌ మంచి చేసినా ఓడిపోవడం ఏమిటి? ఏదో జరిగింది!’ అంటూ గుండెలు బాదుకోవడం రోతగానూ ఉంటోంది. అప్పులు చేసి పంచిపెట్టడం, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను, ప్రశ్నించే వారిని వేధించడం, పోలీసులతో దమన నీతికి పాల్పడటం ఎంత మాత్రం సమర్థనీయం కాదని గ్రహించి ఉంటే ఎన్నికల ఫలితాలు ఇంత దారుణంగా వచ్చి ఉండేవి కావు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు కసిగా ఓట్లు వేశారు. స్వార్థ ప్రయోజనాలకోసం చిడతలు కొట్టిన వారిని మినహాయిస్తే ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా ఆయన పాలన గొప్పగా ఉందని కీర్తించలేదు. అందుకే అత్తెసరు మెజారిటీలతో 11 సీట్లే దక్కించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కుల మతాల రొచ్చులో కూరుకుపోయారన్న భావన నిన్నటిదాకా ఉండేది. తాజా తీర్పుతో వారు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఈవీఎంల బటన్లు నొక్కి మరీ చెప్పారు.

బటన్లు నొక్కడం మినహా జగన్మోహన్‌ రెడ్డి చేసిన మంచి ఇదీ అని చెప్పలేని పరిస్థితి. ప్రజలను కులాల వారీగా విడదీయాలని అనుకున్నారు. ఈ పన్నాగం ఫలించలేదు. పేదలకూ పెత్తందార్లకూ మధ్య పోరాటమంటూ రెచ్చగొట్టిన ప్రయత్నాలు కూడా వికటించాయి. జగన్‌కు వ్యతిరేకంగా మొత్తం 61 శాతం ఓట్లు పడ్డాయి. అంటే, రాష్ట్రంలో పేదలకంటే పెత్తందార్లే ఎక్కువగా ఉన్నారా? జగన్‌ నమ్ముకున్న పేదలు, కులాలు, మతాలకు చెందిన వారిలో కూడా కొందరు ఆయనకు ఓట్లు వేయలేదు. 2019లో ప్రజలు తన నుంచి ఏమి ఆశించి 151 సీట్లతో ఆశీర్వదించారో జగన్‌ తెలుసుకోలేదు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా మేమే అని వైసీపీ నేతలు సినిమా డైలాగులు కొట్టారు. వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ జగన్‌ మాత్రం చరిత్రను తిరగరాశారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఐదేళ్ల దిక్కుమాలిన పాలనతో 140 సీట్లు కోల్పోవచ్చునని జగన్‌ అండ్‌ కో నిరూపించారు. ఇది కూడా చరిత్రే కదా!


అహంకారానికి గుణపాఠం...

సోషల్‌ ఇంజనీరింగ్‌ సాధారణ ఎన్నికల్లో పనిచేయదని మరోమారు రుజువైంది. అధికారం ఉందని ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించిన వారినందరినీ ప్రజలు రాజకీయంగా మట్టుబెట్టారు. ప్రకృతి చాలా గొప్పది. అహంకారంతో విర్రవీగే వారినెవరినీ అది ఉపేక్షించదు. తాను ఒక ముఖ్యమంత్రిననీ, రాజ ధర్మాన్ని పాటించాలనే స్పృహను జగన్‌రెడ్డి కోల్పోయారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నిండు సభలో మంత్రులూ, శాసనసభ్యులూ అవమానిస్తున్నప్పుడు జగన్‌ మహదానందం పొందారు. ఆమె ఉసురు ఊరకే పోతుందా? ధర్మపత్నిని అవమానించినప్పుడు చంద్రబాబు నిస్సహాయంగా విలపించారు. శాసనసభను కౌరవ సభగా మార్చి తనను తీవ్రంగా అవమానించిన సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని చంద్రబాబు చేసిన శపథంలోని ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. జగన్‌ అండ్‌ కో ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే వారిలో ఆ లక్షణం కనిపించడం లేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి తీర్పును తారుమారు చేశారని ప్రచారం చేస్తూ ఆత్మవంచన, పరనిందను కొనసాగిస్తున్నారు. అహంకారం తలకెక్కి వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, లెక్కలేనితనంతో బరితెగిస్తూ, ప్రతిపక్షాన్ని అణచివేస్తూ, చట్టాలను కాపాడాల్సిన వ్యవస్థలనే ఆత్మరక్షణలో పడేస్తూ, న్యాయ వ్యవస్థనూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూ, ప్రశ్నించిన వాళ్లను అవహేళనకు గురిచేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులను కుల పరంగా దూషిస్తూ, విమర్శించిన వారిపై బూతులతో దాడులు చేస్తూ... పోలీసులతో వేధించారు. ప్రభుత్వ వ్యవస్థలను చెరపట్టి, అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసి, యువతకు ఉపాధి కల్పనను గాలికొదిలేసి, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా బోర విరుచుకొని తిరిగినందునే జన సునామీ ఏర్పడి జగన్‌ అండ్‌ కోను ఊడ్చి పారేసింది. గత ఐదేళ్లలో న్యాయ పాలన లేకుండా చేసి మొత్తం రాష్ర్టాన్ని ఉక్కపోతకు గురి చేశారు. ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను ఎత్తి చూపిన వారిని ఎల్లో గ్యాంగ్‌ అని నిందిస్తూ ఆనందం పొందారు. ‘మా ఓటర్లు వేరు– ఎంత మంది వచ్చినా మా వెంట్రుక కూడా పీకలేరు’ అని విర్రవీగారు. చిర్రెత్తుకొచ్చిన ప్రజలు జగన్‌ నెత్తి మీద పదకొండు వెంట్రుకలనే ఉంచి మిగతావి పీకిపారేశారు.


చరిత్ర తిరగరాసి...

2019 ఎన్నికల్లో తాము మోసపోయామని గ్రహించిన ప్రజలు 2024లో తమ తీర్పును తిరగ రాశారు. చుట్టూ ఉన్మాద మూకను పోగేసుకొని తనకు తాను అపర దాన కర్ణుడిగా బిరుదు తగిలించుకొని ఊరేగినంత మాత్రాన వాస్తవ పరిస్థితులను జనం తెలుసుకోలేరని అనుకోవడం జగన్‌ అజ్ఞానానికి నిదర్శనం. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆటకు జగన్‌రెడ్డి తెరలేపారు. సంక్షేమం మాటున ప్రజలకు డబ్బు పంచి, ఆ మాటున దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడినా అధికారానికి ఢోకా ఉండదని భావించారు. అందుకే 2019లో అధికారంలోకి రావడానికి ముందు కూడా... ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొనేవారు. జగన్‌ అనుసరించిన ఈ మోడల్‌ ఎంత ప్రమాదకరమైనదో ప్రజలు ఐదేళ్లకే గుర్తించారు. అందుకే అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు అని జగన్‌ దీర్ఘాలు తీసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలెవ్వరూ ఆయనను మోసం చేయలేదు. ఆయనే గోముఖ వ్యాఘ్రంలా మారిపోయి విశ్వాసఘాతకుడిగా వ్యవహరించారు. సొంత చెల్లిని, తల్లిని కూడా బయటకు గెంటారు. సొంత బాబాయిని చంపిన వారికి కొమ్ము కాస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఉసురు పోసుకున్నారు. తన భార్యను మాత్రం భారతమ్మా అని పిలిపించుకొనే జగన్‌రెడ్డి... సొంత చెల్లి షర్మిల పైకి తన ఉన్మాద మూకను ఉసిగొల్పారు. వీటన్నింటినీ ప్రజలు గ్రహించారు. జగన్‌ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు. సంక్షేమం మాటున జరుగుతున్న అరాచకాన్ని గుర్తించారు. ఫలితమే ఈ చరిత్రాత్మక తీర్పు. చరిత్ర మరువలేని తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఎవరైనా అభినందించాల్సిందే. ఈ ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతీ రాష్ట్రంలోనూ ఒక జగన్‌ తయారయ్యేవారు. రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోని అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమ తీర్పు ద్వారా ఆ పెను ముప్పు నుంచి రాష్ర్టాన్ని మాత్రమే కాదు– దేశాన్ని కూడా కాపాడారు. పాలకులు ఎలా ఉండాలో కూడా ప్రజలు పరోక్షంగా చెప్పారు. నిర్బంధాలు, అణచివేత, ఉన్మాదుల స్వైరవిహారం, రోత మీడియా, కూలి మీడియా– ఇలా ఎంత మంది జతకట్టినా తమ మెదళ్లను కలుషితం చేయలేరని, లొంగదీసుకోలేరని ప్రజలు రుజువు చేశారు. మొత్తంగా జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలన చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఎలాంటి వారు ముఖ్యమంత్రి అవకూడదో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్పష్టం చేశారు.


దక్కని విపక్ష హోదా..

వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్‌ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు. 2019లో వైసీపీకి ఇదే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ మెజారిటీ ఎవరికీ దక్కలేదు. 2019 తర్వాత తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులే ఉండటం, అందులో కూడా నలుగురు జగన్‌ పార్టీలోకి దూకడం చూశాం. ఆనాడు చంద్రబాబుకు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేయాలని జగన్‌రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం నామమాత్రంగానే ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉండటంతో అధికార వైసీపీ నేతలు అహంకారంతో విర్రవీగారు. ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలుగానీ, శాసన సభ్యులుగానీ, కాబోయే మంత్రులుగానీ విర్రవీగితే ఐదేళ్ల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తుంచుకోవాలి. మెజారిటీ ఎంత ఉందన్నది కాదు– రాజ ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాంగబద్ధ పాలన అందించాల్సిన బాధ్యత కూటమి నాయకులు, ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది. జగన్మోహన్‌ రెడ్డి డబ్బు పంచినా ప్రజలు ఎందుకు ఈసడించుకున్నారో అహరహం గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నందున తమకు అడ్డమే ఉండదని అనుకోవద్దు. బాధ్యత గల మీడియాగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థలు ప్రభుత్వ పోకడలపై కన్నేసి ఉంచుతాయి. జగన్‌ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కష్టనష్టాలకు ఓర్చి అలుపెరుగని పోరాటం చేసినట్టుగానే... కూటమి ప్రభుత్వంపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టడానికి మేం వెనుకాడబోము.


చంద్రబాబు జీవితమే ఒక పాఠం..

రాజకీయాలలో అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఇందుకు చంద్రబాబు రాజకీయ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. యువతరం, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జయాపజయాలకు పొంగీ, కుంగీ పోకూడదు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మరెన్నో అవమానాలను అనుభవించారు. అవమానాలు ఎదురైనప్పుడు తాను జాతీయ రాజకీయాలను శాసించిన రోజులను తలచుకుంటూ కుంగిపోలేదు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోగానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోగానీ పదిహేనేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చరిత్ర ఆయనది. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన ఆయన ఖాతాలోకి మరో ఐదు సంవత్సరాలు చేరబోతున్నాయి. ఇది మరో చరిత్ర కాబోతున్నది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. చంద్రబాబును అవకాశం దొరికినప్పుడల్లా అవమానించిన కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డిల పరిస్థితి ఏమిటి? 2018లో రెండోసారి గెలిచిన కేసీఆర్‌ 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఆయనకు రిటన్‌ గిఫ్ట్‌ ఇచ్చానని వికటాట్టహాసం చేశారు. 2023 ఎన్నికల్లో చంద్రబాబు ఏ రూపంలో రిటన్‌ గిఫ్ట్‌ ఇచ్చారో తెలియదుగానీ కేసీఆర్‌ ఓడిపోయి పార్టీని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. తాను జైలు జీవితం గడపడానికి చంద్రబాబు కారణమని భావిస్తూ వచ్చిన జగన్‌రెడ్డి ప్రతీకారంతో రగిలిపోయారు.

తాడూ బొంగరం లేని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును జైలుకు పంపి అహం చల్లార్చుకున్నారు. ఆ కేసులో ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పించారు. ఆ అధికారిని తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకొని ‘‘గతంలో తనను జైలుకు పంపించిన చంద్రబాబును ఇప్పుడు జైలుకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారికి ఉండదా? ముఖ్యమంత్రిని సంతోష పెట్టడానికైనా మీరు చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాల్సిందే’ అని ధనుంజయ్‌ రెడ్డి బెదిరించారు. తన రాజకీయ జీవితం మచ్చలేకుండా ముగియాలని చంద్రబాబు భావించేవారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంతమాత్రాన ఆయన కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఇకపై భవిష్యత్తు ఉంటుందా? అన్న అనుమానాన్ని అనేక సందర్భాలలో ఎంతోమంది వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఆయనను కీలక సమయాల్లో పట్టించుకోలేదు. 2019కి ముందు ప్రధాని నరేంద్ర మోదీతో విభేదించిన చంద్రబాబు ఆయనకు దూరమయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబుపై ప్రధాని కోపంగా ఉన్నారని ప్రచారం జరిగింది. వాజపేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని అప్పటి ఎన్డీయే కన్వీనర్‌ చంద్రబాబు పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకున్నారో లేదో తెలియదుగానీ గత ఐదేళ్లుగా చంద్రబాబుతో అంటీముట్టనట్టుగానే ప్రధాని మోదీ వ్యవహరించారు. అయినా చంద్రబాబు కుంగిపోలేదు. తాజా ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదరడం, రాష్ట్రంలో ప్రజలు అసాధారణ తీర్పు ఇవ్వడంతో పాటు కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లభించకపోవడంతో చంద్రబాబుకు మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు రాజకీయంగా గొప్ప గౌరవ మర్యాదలు లభించాయి. జాతీయ మీడియా ఆయనకోసం పరుగులు పెట్టింది. అంతమాత్రాన ఆయన పొంగిపోవడం లేదు. 2019లో ఓడిపోయాక దాదాపు రెండేళ్లపాటు చంద్రబాబును పలకరించేవారే కరువయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వేరెవరూ ఆ పరిస్థితిని తట్టుకోలేరు. కానీ చంద్రబాబుకు సహనం ఎక్కువ. మంచి రోజుల కోసం ఓపికగా ఎదురుచూశారు.


ఆ మంచి రోజులు ఇప్పుడు వచ్చాయి. చంద్రబాబు విజయ గర్వంతో విర్రవీగకపోవచ్చునుగానీ తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. కేంద్రంలో చంద్రబాబుకు పెరిగిన పలుకుబడి రాష్ర్టానికి మంచి చేస్తుందని ఆశిద్దాం! జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులపాలై అభివృద్ధిలో అధోగతికి చేరుకుంది. ఇప్పుడు రాష్ర్టాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా జగన్‌ వ్యతిరేకతే పనిచేసింది. జగన్‌ వ్యతిరేక, జగన్‌ అనుకూలురుగా ప్రజలు విడిపోయారు. ఒక ముఖ్యమంత్రి పట్ల వ్యక్తిగతంగా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడిందో కూటమి నేతలు గుర్తెరగాలి. జాతీయ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రపంచ నాయకుడిగా కీర్తించబడిన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రజలు తమ తీర్పు ద్వారా హెచ్చరికలు పంపారు. ఏ పాలకుడైనా కట్టు తప్పినప్పుడు ప్రజల ధర్మాగ్రహానికి గురికావాల్సిందే. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ‘నేను’ అన్న అహం ఎవరికి తలకెక్కినా ప్రకృతి రూపంలో పతనం కాచుకొనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఈ సత్యాన్ని గుర్తించి ధర్మబద్ధమైన పాలన అందిస్తారని ఆశిద్దాం! మెజారిటీ ఎంత వచ్చిందన్నది ముఖ్యం కాదు– అధికారం ఐదేళ్లు మాత్రమేనని అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం వేటు వేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

ఈ కాలమ్‌ రాయడానికి ఉపక్రమించినప్పుడే రామోజీరావు ఇక లేరన్న వార్త వెలువడింది. తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఆయన మరణం పత్రికా రంగానికే కాదు, సమాజానికి కూడా లోటు. అధికార హూంకరింపులకు వెరవకుండా రామోజీరావు అక్షర యుద్ధం సాగించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థల తరఫున ఆయనకు అక్షర నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను!

ఆర్కే

Read more!

Updated Date - Jun 09 , 2024 | 06:55 AM

Advertising
Advertising