సగానికి సగం.. యువ తరంగం!
ABN , Publish Date - May 09 , 2024 | 06:20 AM
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
పార్లమెంటు ఓటర్లలో 50.4 శాతం వీరే
18-39 మధ్య వయసు ఓటర్లు 1.67 కోట్లు
పెద్దపల్లి, పాలమూరుల్లో అత్యధికం
సికింద్రాబాద్, వరంగల్‌లో అత్యల్పం ఓటర్లలో 30-39 మధ్య వయస్కులు ఎక్కువ
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!? యువత తలచుకుంటే ప్రభుత్వాలను తారుమారు చేయగలరని తెలుసా!? లోక్‌సభ ఎన్నికల్లో యువత ఓటింగ్ అత్యంత కీలకం కానుందని తెలుసా!? ఔను.. ఇది నిజం! తెలంగాణలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 18-39 ఏళ్ల మధ్య వయస్కులైన యువ ఓటర్లు 1,67,51,806 మంది! అంటే, మొత్తం ఓటర్లలో వీరు 50.4 శాతమన్నమాట! అందుకే, అన్ని పార్టీలూ యువతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.
పార్టీ యూత్ కమిటీ నాయకులను రంగంలోకి దింపి వారు కోరుకునే అంశాలపై దృష్టిసారించి వాటిని వారికి అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో పెద్దపల్లి, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో అత్యధికంగా యువ ఓటర్లు ఉండగా.. సికింద్రాబాద్, వరంగల్ నియోజక వర్గాల్లో అత్యల్పంగా ఉన్నారు. విశేషం ఏమిటంటే.. రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడైన గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్న పెద్దపల్లిలోనే యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం!! అలాగే, రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో యువత సంఖ్య కూడా ఎక్కువే. అయితే, అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యువత ఎవరిని ఆదరిస్తుంది!? ఎవరికి ఓటు వేస్తుందన్నది ఆసక్తికరమే!!
యూత్ ః 14
పార్లమెంటు ఎన్నికల్లో యువతకు పార్టీల ప్రాధాన్యం
కాంగ్రెస్ అత్యధికంగా ఎనిమిదిమందికి టికెట్లు
అతి పెద్ద వయస్కుడు మల్లు రవి అతి పిన్న వయస్కుడు వంశీకృష్ణ
పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి పార్టీలు యువతకు ప్రాధాన్యం ఇచ్చాయి. 50 ఏళ్లలోపు వయసున్న 14 మందికి మూడు పార్టీలూ టికెట్లు ఇచ్చాయి. వీటిలో కాంగ్రెస్ అత్యధికంగా ఎనిమిది మందికి; బీజేపీ నలుగురికి; బీఆర్‌ఎస్ ఇద్దరికి అవకాశం ఇవ్వడం విశేషం. వీరిలోనూ సగానికిపైగా రాజకీయాలకు, ఎన్నికలకు పూర్తిగా కొత్త కూడా! విశేషం ఏమిటంటే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కుడు, అతి పెద్ద వయస్కుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే! అభ్యర్థుల్లో అతి పెద్ద వయస్కుడు 73 ఏళ్ల మల్లు రవి కాగా.. అతి పిన్న వయస్కుడు గడ్డం వంశీకృష్ణ!