Lok Sabha Elections 2024: అది అబద్ధమైతే నేను రాజీనామా చేస్తా..కేటీఆర్ సవాల్
ABN, Publish Date - May 01 , 2024 | 05:11 PM
తెలంగాణలో కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని అన్నారు. కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోదీ దేవుడని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని అన్నారు. కార్మికులు, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోదీ దేవుడని ప్రశ్నించారు. సెస్‌ల పేరుతో ప్రజల తోలు పిండి రూ.30లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుల నుంచి రూ.14లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ రుణమాఫీ చేశారని విమర్శించారు. తాను చెప్పింది అబద్ధమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
Konda Surekha: కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం
తెలంగాణ భవన్‌లో బుధవారం మేడే వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఉచితాలు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుచితం అంటారని.. కానీ బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మోదీ కార్పొరేట్లకు చేసిన రుణమాఫీ డబ్బులతో పదేళ్లు దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు. ఏమైనా అంటే జై శ్రీరాం. మనం యాదగిరి గుట్ట కట్టలేదా? అని బీజేపీ నేతలు అంటారన్నారు. తాము ఎప్పుడైనా రాజకీయాల్లో మతాన్ని వాడుకున్నామా? అని ప్రశ్నించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారని.. వారు చేసిన పనిని కూడా చెప్పుకోలేని దద్దమ్మలు ఈ బీజేపీ నేతలని విమర్శించారు.
సీఎం రేవంత్ మళ్లీ సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని మండిపడ్డారు. ఫ్రీ బస్సు తప్పుకాదని..కానీ దాని ఆధారంగా ఉపాధి కోల్పోయే ఆటోడ్రైవర్లకు మేలు చేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణను సాధించామని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 10-12 ఎంపీ సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. ఈ సీట్లు గెలిస్తే మళ్లీ కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. గోదావరి నీళ్లను మన రాష్ట్ర అవసరాలకు తీర్చకుండా.. వేరే రాష్ట్రాలకు మళ్లీస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్ర పోకడులను కచ్చితంగా అడ్డుకోని తీరుతామని.. ఎక్కడి వరకైనా పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. కేంద్రంతో తెలంగాణ సమస్యలపై కోట్లాడాలంటే బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. రిజర్వేషన్లు, ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు
Read Latest Election News or Telugu News
Updated Date - May 01 , 2024 | 08:53 PM