సత్సంగ్‌లో తొక్కిసలాట.. 116 మంది దుర్మరణం
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:23 AM
దైవ భక్తితో నాలుగు మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే.
చనిపోయినవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ.. మృతులు పెరిగే ముప్పు
స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మిక వేత్త ‘భోలేబాబా’ సత్సంగ్‌కు వేలాది జనం
కార్యక్రమం ముగిశాక బయటకి వెళ్లే క్రమంలో తోపులాట.. పెనుప్రమాదం
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, అమిత్‌షా, ఖర్గే, రాహుల్ సంతాపం
దైవ భక్తితో నాలుగు మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి! 150 మందికి పైగా గాయపడ్డారు. 5000 మంది మాత్రమే పట్టే చోట.. పదిహేను వేల మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోరమిది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతిభాన్‌పూర్ గ్రామంలో భోలే బాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.
హత్రాస్, జూలై 2: యూపీలోని కిషన్‌గంజ్ జిల్లాకు చెందిన భోలే బాబా.. గతంలో పోలీసు శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్లపాటు పనిచేసి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయనను ‘నారాయణ సాకార్ హరి’.. ‘సాకార్ విశ్వ హరి బాబా’ అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతుంటారు. యూపీ నుంచే కాక.. హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా భోలేబాబా సత్సంగాలకు రావడం కద్దు. ఫేస్‌బుక్‌లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే.. మంగళవారం హత్రా్‌సలో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లోపల వాతావరణమంతా ఉక్కగా ఉండడంతో అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని.. కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. మరికొందరేమో..కార్యక్రమం చివర్లో భక్తులు భోలేబాబాను దగ్గర్నుంచీ చూడడానికి, ఆయన పాద ధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్టు చెబుతున్నారు.
ప్రముఖుల సంతాపం..
ఈ ప్రమాదవార్త తెలిసే సమయానికి ప్రధాని మోదీ లోక్‌సభలో ఉన్నారు. వెంటనే ఆయన సభకు ఈ విషయాన్ని తెలియజేసి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు యూపీ సర్కారుతో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయసహకారాలూ అందిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం.. హత్రాస్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున.. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్ యాదవ్ తదితరులు జరిగిన ఘోరం పట్ల సంతాపం తెలిపారు. అమిత్ షా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యోగి కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వెలు చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు.. ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం ఆయన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించనున్నట్టు సమాచారం. ఇక.. హత్రా్‌స దుర్ఘటన తన మనసునెంతో బాధించిందని.. అక్కడి హృదయాలు తన హృదయాన్ని కలచివేశాయని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం చేయాలని రాహుల్, ప్రియాంక డిమాండ్ చేశారు.