Bhopal : బీజేపీలోకి మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ జడ్జి
ABN , Publish Date - Jul 15 , 2024 | 03:03 AM
మధ్యప్రదేశ్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్ రోహిత్ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు.
భోపాల్, జూలై 14: మధ్యప్రదేశ్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి రాఘవేంద్ర శర్మ కాషాయ కండువా కప్పి జస్టిస్ రోహిత్ ఆర్యను పార్టీలోకి ఆహ్వానించారు. 2013 సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2015 మార్చిలో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితమే పదవీ విరమణ పొందారు.
ఆయన తన పదవీ కాలంలో ఇచ్చిన పలు తీర్పులు వివాదాస్పదమయ్యాయి. 2021లో ఇండోర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో చెలరేగిన మతపరమైన ఘర్షణల కేసును ఆయన విచారించారు. కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన హాస్యనటులు మునావర్ ఫరూఖీ, నలిన్ యాదవ్‌కు బెయిలు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. 2020లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఆమెతో రాఖీ కట్టించి జీవితాంతం ఆమెకు రక్షణగా ఉంటాననే హామీ తీస్కొని అతనికి బెయిల్ మంజూరు చేశారు.