Viral Video: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:38 PM
Viral Video: ఓ రాజకీయ నేత ప్రయాణిస్తున్న కారులో సమస్య తలెత్తింది. దీంతో రహదారిపై కారు నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జైపూర్, డిసెంబర్ 31: అత్యంత ఖరీదైన ఓ ఎలక్ట్రిక్ కారును ఎద్దులు లాగుతున్నాయి. ఎద్దుల మెడపై ఉన్న కర్రకు.. కారుకు తాడుతో గట్టిగా కట్టారు. ఎద్దులు ముందుకు కదులుతుండగా.. ఆ వెనుక కారు వెళ్తుంది. ఆ క్రమంలో ఎద్దులు ముందుకు కదలకుండా మొరాయిస్తుంటే.. వాటిని ఓ యువకుడు అదిలిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అత్యధిక మంది నెటిజన్లు వీక్షించారు. ఇంతకీ ఈ వీడియోలో సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే.. రాజస్థాన్‌లో దీద్వానా జిల్లాలో. కుచామన్ నగర పరిషత్‌లో అనిల్ సింగ్ మెడ్తియా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రహదారిపై ఆగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమీపంలో ఎద్దులను తీసుకు వచ్చి.. రహదారిపై నిలిచిపోయిన కారును గమ్యస్థానానికి తరలించారు. అయితే ఈ ఘటనపై నాయకుడు అనిల్ సింగ్ స్పందించారు.
ఏడాదిలో 16 సార్లు.. ఈ కారును సర్వీస్ సెంటర్‌కు పంపినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తరచూ కారులో సమస్యలు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు కంపెనీకి ఫిర్యాదు చేసినా.. సంస్థ నుంచి సరైన స్పందన మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారు మైలేజ్ ఇస్తుందని తయారీదారులు తాను కొనుగోలు చేసే సమయంలో హామీ సైతం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కానీ తరచూ కారులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
ఇదిలా ఉండగా మరో ఘటనలో రాయ్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌లో ఫెరారీ వాహనం ఇరుక్కుపోయింది. దీనిని సైతం ఎద్దుల బండి ద్వారా స్థానికుల సహాయంలో బయటకు తీశారు. ఇంకోవైపు ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోన్నారు. అలాంటి వేళ.. అంటే.. గత వారం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ.. తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 4,000 స్టోర్‌లకు విస్తరించింది. దీంతో ఈ సంస్థ నెట్ వర్క్ నాలుగు రెట్లకు పెరిగినట్లు అయింది.
For National News And Telugu News