Share News

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:31 AM

ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలేనని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

నేతలు,జడ్జీలు కలవడం మామూలే

న్యూఢిల్లీ, అక్టోబరు 28: ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మామూలేనని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఆ సమయంలో న్యాయ సంబంధ విషయాల ప్రస్తావన వారి మధ్య రాదని, అటువంటి సందర్భం తనకు ఒక్కటి కూడా గుర్తు లేదని ఆయన తెలిపారు. తమ ఇంట్లో గణపతి పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించడంపై రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో పదవీవిరమణ చేయనున్న ఆయన ఈ వివాదంపై లోక్‌సత్తా వార్షిక సమావేశంలో స్పందించారు. ‘‘ఎందుకని రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు కలుసుకుంటారో తెలుసుకోవాలని ప్రజలకు ఉంటుంది. అయితే, న్యాయవ్యవస్థతోపాటు రాజకీయ వ్యవస్థకు కూడా పరిణతి ఉంది. న్యాయ వ్యవస్థకు అవసరమైన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది న్యాయమూర్తుల కోసం కేటాయించే బడ్జెట్‌ కాదు. నూతన కోర్టు భవనాలు, జిల్లాల్లో న్యాయమూర్తులకు కొత్త నివాస సముదాయాల ఏర్పాటు కోసం ఆ బడ్జెట్‌ను వినియోగిస్తారు. ఇలాంటి అవసరాలు తీరాలంటే ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుకోవడం అవసరం’’ అని ఆయన వివరించారు.

‘‘ఆగస్టు 14, జనవరి 26తో పాటు పెళ్లిళ్లు, మరణాలు.. ఇలా సందర్భం ఏదైనా సీఎం, చీఫ్‌జస్టిస్‌ కలుస్తుంటారు. న్యాయ సంబంధ అంశాలేవీ అక్కడ ప్రస్తావనకు రావు’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. కాగా, గణపతి పూజ కోసం సీజే ఇంటికి ప్రధాని వెళ్లడంపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. శివసేన(యూబీటీ), శివసేన (షిండే) పార్టీల మధ్య వివాదంపై విచారణ నుంచి జస్టిస్‌ చంద్రచూడ్‌ తప్పుకోవాలని శివసేన (యూబీటీ) డిమాండ్‌ చేసింది.

Updated Date - Oct 29 , 2024 | 03:31 AM