Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు...మాకు సంబంధం లేదన్న కాంగ్రెస్
ABN , Publish Date - May 08 , 2024 | 03:29 PM
కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష' వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి.ఈ నేపథ్యంలో పార్టీకి, పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు వివరణ ఇచ్చారు.
న్యూఢిల్లీ: 'వారసత్వ పన్ను' వివాదంపై తలెత్తిన మంటలను చల్లార్చేందుకు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన 'జాతి వివక్ష' వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భూరతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారంటూ శామ్ పిట్రోడా 'స్టేట్స్‌మన్' పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని నిప్పులు చెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీకి, పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) బుధవారంనాడు వివరణ ఇచ్చారు.
''భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వంపై పిట్రోడా వ్యాఖ్యలు దురదష్టకరం. పిట్రోడా పోలికలు మాకు ఆమోదయోగ్యం కాదు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు'' అని జైరామ్ రమేష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం
పిట్రోడా ఏమన్నారు?
భారతదేశంలో ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి పిట్రోడా తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి భారతదేశమే ఉత్తమ నిదర్శమని అన్నారు. వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బులుగా కనిపిస్తారని, ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరగా ఉంటారని చెప్పారు. ఇవన్నీ ఎలా ఉన్నా అందరూ పరస్పరం గౌరవించుకుంటారని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జాతి మూలాల్లోనే ఉన్నాయని అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత్ బిశ్వా శర్మ ఒక ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. పిట్రోడా వ్యాఖ్యలు నిస్సందేహంగా జాతి వివక్షేనని అన్నారు. తాను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తినని, ఇండియన్‌లా కనిపిస్తానని చెప్పారు. భారతావనిలో మనం భిన్నంగా కనిపించినా అంతా ఒకటేనని అన్నారు. దేశం గురించి కనీసం విజ్ఞానం పెంచుకోండి...అని ఆయన వ్యాఖ్యానించారు. విభజించి పాలించాలనే కాంగ్రెస్ సిద్ధాంతం సిగ్గుచేటని ఆక్షేపించారు.
Read Latest National News and Telugu News