Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..
ABN, Publish Date - Oct 16 , 2024 | 10:42 AM
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మెుత్తం 90సీట్లలో ఎన్‌సీ 42 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాబోదని, బయటి నుంచి మాత్రం మద్దతు ఇస్తుందని ఇవాళ (బుధవారం) ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ను ప్రభుత్వంలో భాగం చేయాలని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానాన్ని కోరినప్పటికీ ఢిల్లీ పెద్దలు అందుకు నిరాకరించారు. అయితే ఆ రాష్ట్రంలో పార్టీ నేతల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు నూతనంగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒమర్ అబ్దులా సానుకూలంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. పదవులకు కాకుండా జమ్మూకశ్మీర్‌లో పార్టీ బలోపేతానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయాలని స్థానిక నేతలను ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మెుత్తం 90సీట్లలో ఎన్‌సీ 42 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఆప్ ఎమ్మెల్యే ఒకరు ఒమర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు.
సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..
ఇవాళ (అక్టోబర్ 16) ఉదయం 11:30 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(SKICC)లో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో సీఎంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. అలాగే తొమ్మది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, కార్యక్రమంలో పెద్దఎత్తున ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాగే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంపీ ఎంపీ కనిమెళి కరుణానిధి, ఎన్సీపీ- ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డి.రాజా పాల్గొన్నారు. తమ అభిమాన నేత సీఎంగా ప్రమాణం చేస్తుండడంతో నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ మెుట్టమెుదటి సీఎంగా ఒమర్ అబ్దుల్లా రికార్డు సృష్టించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Haryana: దీపావళికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన యజమాని.. ఉబ్బితబ్బిపోతున్న ఉద్యోగులు..
Chennai: రెడ్ అలర్ట్.. నేడు చెన్నై సహా 4 జిల్లాలకు సెలవు
Updated Date - Oct 16 , 2024 | 12:14 PM