Delhi : టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయండి
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:42 AM
కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 30: కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్‌పై హత్య సహా ఇతర అభియోగాలను నమోదు చేయాలని శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984లో సిక్కులపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర ఢిల్లీలోని పుల్ బంగేష్ వద్ద ముగ్గురు సిక్కులు హత్యకు గురికావడం వెనుక ఆయన ప్రమేయం ఉందంటూ కేసు నమోదయింది. ఆయనపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక జడ్జి రాకేష్ సియాల్ అభిప్రాయపడ్డారు. హత్యతో పాటు చట్టవ్యతిరేకంగా గుమికూడడం, అలర్లు సృష్టించడం, వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచడం, ఇళ్లల్లో చొరబడడం, దొంగతనం చేయడం వంటి అభియోగాలు కూడా నమోదు కానున్నాయి.
ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ అభియోగాలు మోపనున్నారు. ‘‘1984 నవంబరు ఒకటో తేదీన తెల్లని అంబాసిడర్ కారులో గురుద్వారా పుల్ బంగేష్ వద్దకు వచ్చిన టైట్లర్ ‘సిక్కులను చంపండి. మన అమ్మను వారు చంపేశారు’ అంటూ రెచ్చగొట్టాడని, అనంతరం ముగ్గురు హత్యకు గురయ్యార’’ని ఆ వ్యక్తి అఫిడవిట్లో పేర్కొన్నాడు. దాని ఆధారంగా అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.