Share News

మణిపూర్‌లో సత్వరమే పర్యటించండి

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:59 AM

అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో సత్వరమే పర్యటించాలని ప్రధాని మోదీని ఇండియా కూటమి డిమాండు చేసింది.

మణిపూర్‌లో సత్వరమే పర్యటించండి

శాంతి స్థాపనకు అదే మార్గం

ప్రధానికి ఇండియా కూటమి డిమాండ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 6: అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో సత్వరమే పర్యటించాలని ప్రధాని మోదీని ఇండియా కూటమి డిమాండు చేసింది. ప్రధాని నేరుగా జోక్యం చేసుకుంటేనే శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడింది. ఇండియూ కూటమిలోని పది పార్టీల నాయకులు శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాము జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తామంటే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దాంతో ప్రధాని కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. మణిపూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.మేఘచంద్ర మాట్లాడుతూ తమ రాష్ట్రం కూడా భారత్‌లో అంతర్భాగమేనని, 18 నెలలుగా హింస నెలకొన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. 60వేల మంది సహాయ శిబిరాల్లో ఉన్నారని, ఇంకెంతమంది ఇబ్బందులు పడాలని ప్రశ్నించారు. మణిపూర్‌లో ‘అప్రకటిత రాష్ట్రపతి పాలన’ కొనసాగుతోందని, సీఎం కాగితం పులిలా మిగిలిపోయారని విమర్శించారు. మణిపూర్‌ ఇండియా కూటమి కన్వీనర్‌ క్షేత్రిమయుం శాంతా మాట్లాడుతూ శాంతి స్థాపన కోరుతూ ధర్నా చేసేందుకు 3,000 కి.మీ.దూరం నుంచి వస్తే అనుమతి నిరాకరించారని తెలిపారు. రెండేళ్లుగా హింస కొనసాగుతున్నా ప్రధాని మోదీ మణిపూర్‌ను సందర్శించలేదని విమర్శించారు.


కేంద్ర మంత్రులు700 సార్లు పర్యటించారు

ఈశాన్య రాష్ట్రాల అందాలను పరిచయం చేయడానికి ఢిల్లీలో నిర్వహించిన అష్టలక్ష్మి మహోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఓట్లు లేవన్న కారణంతో గత ప్రభుత్వాలు ఆ ప్రాంతాన్ని పట్టించుకోలేదని చెప్పారు. తమ ప్రభుత్వం హయాంలో గత పదేళ్లుగా కేంద్ర మంత్రులు 700 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు. ఆ ప్రాంతం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Updated Date - Dec 07 , 2024 | 05:08 AM