Share News

Lok Sabha Elections: మోదీ 'రామమందిరం-బుల్డోజర్' వ్యాఖ్యలపై కస్సుమన్న ఖర్గే.. ఈసీ చర్యలకు డిమాండ్

ABN , Publish Date - May 18 , 2024 | 04:57 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Lok Sabha Elections: మోదీ 'రామమందిరం-బుల్డోజర్' వ్యాఖ్యలపై కస్సుమన్న ఖర్గే.. ఈసీ చర్యలకు డిమాండ్

ముంబై: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీపీ-ఎస్‌పీ నేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి ముంబైలో శనివారంనాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే పాల్గొన్నారు.


''ఇప్పటి వరకూ మాదగ్గర బుల్డోజర్లు లేవు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ ప్రకారం అన్నింటినీ పరిరక్షిస్తాం. మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తాం'' అని ఖర్గే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నిజమైన పార్టీకి బదులు బీజేపీకి మద్దతిస్తున్న వర్గాలకు ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. నయవంచన, కుట్రలతో మహారాష్ట్రలో చట్టవిరుద్ధంగా 'మహాయుతి' ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రధానమంత్రే స్వయంగా దీనికి మద్దతిచ్చారని, మహారాష్ట్రలో ర్యాలీలు కూడా తీశారని అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆరోపించారు. నిజమైన పార్టీల నుంచి గుర్తులు లాక్కుని బీజేపీకి మద్దతిచ్చే పార్టీలకు వాటిని కేటాయించడం వంటి నిర్ణయాలన్నీ మోదీ ఆదేశాల మీదే జరుగుతున్నాయన్నారు.

Rahul Gandhi: నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక కేకులు, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు..


మహారాష్ట్రలో 46 సీట్లు గెలుస్తాం..

మహారాష్ట్రలో 'ఇండియా' కూటమి పనితీరుపై ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 48 సీట్లలో 46 సీట్లు తమ కూటమి గెలుచుకుంటుందని, ప్రజలే స్వయంగా ఈ విషయం చెబుతున్నారని అన్నారు. తమ కూటమి బీజేపీని ఓడించి గరిష్టంగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల డైనమిక్స్‌పై అడిగిన ఒక ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, ఢిల్లీలో రెండు పార్టీలు బీజేపికి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తు్న్నాయని, పంజాబ్‌లో వేర్వేరుగా పోటీలో ఉన్నాయని చెప్పారు. ''ఇది ప్రజాస్వామ్యం. బీజేపీని ఓడించడానికి ఏమి చేయాలో అది చేస్తాం'' అని ఖర్గే తెలిపారు. లోక్‌సభ ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని 6 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరుగనుంది. ధులే, దిండోరి, నాసిక్, కల్యాణ్, పాల్ఘర్, భివాండీ, థానే నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 04:57 PM