Share News

Sonia Gandhi: వెలుగునింపిన ‘మహాలక్ష్మీ’

ABN , Publish Date - May 14 , 2024 | 03:26 AM

దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.

 Sonia Gandhi: వెలుగునింపిన ‘మహాలక్ష్మీ’
sonia gandhi

గ్యారెంటీల అమలుతో తెలంగాణలో మార్పు: సోనియా

న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘మహాలక్ష్మి పథకం’ వారి జీవితాలను మార్చడానికి సహాయపడుతుందని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద పేద కుటుంబాల మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సోమవారం, లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ జరుగుతున్నవేళ సోనియాగాంధీ ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపారు. కాంగ్రె్‌సకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ గ్యారెంటీల అమలుతో ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కోట్లాది కుటుంబాల జీవితాలు మారిపోయాయని చెప్పారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు, విద్యాహక్కు, ఆహార భద్రత వంటి పథకాల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ లక్షల మంది భారతీయులకు సాధికారత కల్పించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తమ ఎక్స్‌ ఖాతాల్లో సోనియా వీడియోను షేర్‌ చేశారు. పేదకుటుంబాల మహిళల ఒక్కో ఓటు ఏడాదికి రూ.లక్షతో సమానమని గుర్తుపెట్టుకోవాలన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళలకు కాంగ్రెస్‌ ‘మహాలక్ష్మి’ పథకం చేయూతనిస్తుందని.. ప్రతి నెలా రూ.8,500 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా మహిళలు తమ కుటుంబాల భవితవ్యాన్ని తామే రాసుకోగలరని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2024 | 07:45 AM