Himanta Sarma: పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, యూసీసీ వచ్చిందో జైలుకే..
ABN , Publish Date - Mar 31 , 2024 | 07:12 PM
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ (Himanta Biswa Sarma)కు, ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ (Badruddin Ajmal)కు మధ్య మాటలు తూటాలు పేలాయి. లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగనున్న క్రమంలో ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు వాగ్బాణాలు గుప్పించుకున్నారు. ''మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code- UCC) రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుంది'' అంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.
ధుబ్రి నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న బద్దుద్దీన్ ఇటీవల మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో ఉన్న కొందరితో పాటు రకిబుల్ హుస్సేన్ (ధుబ్రి కాంగ్రెస్ అభ్యర్థి) తనను వృద్ధుడైపోతున్నానని అంటున్నారని, అయితే తాను పెళ్లి చేసుకోవడానికి అవసరమైనంత దృఢంగా ఉన్నానని చెప్పారు. ముఖ్యమంత్రి (శర్మ) కాదన్నా సరే ఆ పని (మరో పెళ్లి) తాను చేస్తానని, అందుకు తగిన 'సత్తా' తనదగ్గర ఉందని అన్నారు. దీనిపై ఒక ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన హిమంత్ బిశ్వ శర్మ తాజాగా స్పందించారు. ఆయన (బద్రుద్దీన్ అజ్మల్) ఇప్పడు కావాలంటే వివాహం చేసుకోవచ్చునని, ఎన్నికలయిన తర్వాత అసోంలో యూసీసీ అమలు చేస్తామని, అప్పుడు వివాహం చేసుకుంటే ఆయన అరెస్టు కావాల్సి ఉంటుందని చమత్కరించారు. ఇప్పుడైతే ఆయన పెళ్లికి ఆహ్వానిస్తే తాము కూడా వెళ్తామని, ఎందుకంటే ఇప్పటివరకూ బహుభార్యాత్వం చట్టవిరుద్ధం కాదని చెప్పారు. తనకు తెలిసినంద వరకూ ఆయనకు ఒక వివాహం అయిందని, ఆయన మరో రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చనీ, ఎన్నికల తర్వాత మాత్రం బహుభార్యాతం హక్కులను నిలిపివేస్తామని, ఇందుకు సంబంధించిన డ్రాప్ట్ కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాగా, అసోం లోక్‌సభ ఎన్నికలు మూడు దశల్లో- ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.