Atal Setu: 7 నెలల్లో 50 లక్షలు.. అటల్ సేతు రికార్డ్
ABN , Publish Date - Aug 28 , 2024 | 08:02 AM
దూర భారాన్ని తగ్గిస్తూ.. ముంబయివాసుల చిరకాల కలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన రికార్డు నెలకొల్పింది.
ముంబయి: దూర భారాన్ని తగ్గిస్తూ.. ముంబయివాసుల చిరకాల కలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన రికార్డు నెలకొల్పింది. ప్రారంభించిన 7 నెలల్లోనే ఏకంగా 50 లక్షలకుపైగా వాహనాలు ఈ వంతెనపై నుంచి వెళ్లాయని అధికారులు తెలిపారు. మరికొన్ని నెలల్లో ఈ సంఖ్య కోటికి చేరుతుందని తెలిపారు. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) బృహన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్), నవీ ముంబయి మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (NMMT), మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) శివనేరితో సహా 50,04,350 వాహనాలు ఈ వంతెనపై ప్రయాణించాయి. జనవరి 13, ఆగస్టు 26 మధ్య కాలానికి సంబంధించి అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. రోజూవారీగా సరాసరి 22 వేల వాహనాలు ప్రయాణించాయని తెలిపారు. అటల్ సేతుపై నుంచి వెళ్లిన వాహనాల్లో 47,40,677 కార్లు, 50,020 LCV/మినీ బస్సులు, 59,799 బస్సు/2-యాక్సిల్ ట్రక్, 73,074 మల్టీ-యాక్సిల్ వెహికల్ (3 యాక్సిల్), 80,277 మల్టీ ఎక్స్ వాహనాలు ఉన్నాయి.
ఎన్నో ప్రత్యేకతలు..
దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 12న ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి సేవలకు గుర్తుగా ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. సుమారు 21.8 కి.మీ పొడవుతో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీని నిర్మాణానికి రూ. 17 వేల 840 కోట్లు ఖర్చైంది. దక్షిణ ముంబయి నుంచి నవీ ముంబయిని ఈ బ్రిడ్జ్ అనుసంధానం చేస్తుంది. ఇదివరకు రెండున్నర గంటలు పట్టే ప్రయాణ సమాయం ఈ బ్రిడ్జికి అందుబాటులోకి రావడంతో కేవలం 20 నిమిషాలే పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. వాహనదారుల భద్రత కోసం బ్రిడ్జిపై 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై గంటకు 100 కి.మీ.ల వేగంతో వాహనాలు వెళ్లొచ్చు.