Share News

యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:06 AM

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలెట్‌ గోవిందపురి స్టేషన్‌ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్‌) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు.

యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం

  • మరో రెండు చోట్ల కాంక్రీట్‌ స్తంభం, రాళ్లు

న్యూఢిల్లీ, మహోబా, సెప్టెంబరు 29: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలెట్‌ గోవిందపురి స్టేషన్‌ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్‌) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు. దీంతో దానికి కొద్ది దూరంలో రైలు ఆగింది. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో వెళుతుండడంతో ముప్పు తప్పిందని లోకోపైలెట్‌ తెలిపారు. కంట్రోల్‌రూమ్‌కి సమాచారం ఇచ్చాక దాన్ని కాన్పూర్‌ సెంట్రల్‌ స్టేషన్‌ తీసుకువచ్చారు. అది రైల్వేకి సంబంధించినఅగ్నిమాపక పరికరమేనని గుర్తించారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇదే రాష్ట్రంలో బాందా-మహోబా రైల్వే ట్రాకుపై శనివారం మధ్యాహ్నం కాంక్రీట్‌ స్తంభం ఉంచారు. దీంతో ఆ మార్గంలో వస్తోన్న పాసింజర్‌ రైలును లోకోపైలెట్‌ అత్యవసర బ్రేకులు వేసి నిలిపివేశారు. పోలీసులు, రైల్వే రక్షక దళ సిబ్బంది అక్కడికి చేరుకుని రైల్వేట్రాకుపై ఆ స్తంభాన్ని ఉంచిన 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలోని బైరియా ప్రాంతంలోనూ శనివారం ఉదయం ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.

బైరియా ప్రాంతంలో రైల్వేట్రాకుపై ఉంచిన రాయిని రైలు ఇంజను ఢీకొంది. అయితే లోకోపైలెట్‌ అత్యవసర బ్రేకులు వేసి ఆపడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. దీనికి కారకులను గుర్తించేందుకు రైల్వే రక్షక దళం ఆదివారం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అంతేగాక ఆ మార్గంలో పెట్రోలింగ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 30 , 2024 | 05:06 AM