Lucknow : ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీక్
ABN, Publish Date - Jun 25 , 2024 | 04:44 AM
ఓవైపు నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి.
యూపీలో ఆర్‌వో ప్రశ్నపత్రం లీకులో మరో ఆరుగురు నిందితులు అరెస్టు
నీట్ ప్రధాన నిందితుడు రవికి కూడా చేరవేత
లఖ్‌నవూ, జూన్ 24: ఓవైపు నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్/ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీకేజీ దర్యాప్తులో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 11న ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ నియామక పరీక్షకు పది లక్షలమందిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, లీకేజీ ఆరోపణలతో ప్రభుత్వం మార్చి 2న రద్దు చేసింది. ఆపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఈ బృందం ఆదివారం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన విశాల్ దూబె, సందీప్ పాండేతో పాటు వివేక్ ఉపాధ్యాయ్(బలియా), అమర్జీత్ శర్మ(గయ-బిహార్), సుభాష్ ప్రకాష్(మధుబని- బిహార్), సునీల్ రఘువంశీ(భోపాల్-మధ్యప్రదేశ్)లను అరెస్టు చూపించింది. వీరిలో సునీల్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తుంటాడు. గతంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజీవ్ నారాయణ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా.. రెండు మార్గాల్లో పేపర్ లీక్ అయిందని తేలిందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 11న ఉదయం 6.30 సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని బిషన్ జాన్సన్ బాలికల పాఠశాల/కళాశాల సెంటర్‌లో పరీక్ష బాధ్యతల్లో ఉన్న కమలే్‌షకుమార్ పాల్ అలియాస్ కేకే, డాక్టర్ శరద్‌సింగ్ పటేల్, సౌరభ్ శుక్లా, అరుణ్‌సింగ్, అర్పిత్ వినీత్ యశ్వంత్‌లు తమ ఫోన్ల ద్వారా పేపర్‌ను స్కాన్ చేశారు. కొందరు అభ్యర్థులకు పంపారు.
దీనికిముందే ఫిబ్రవరి 3న సునీల్ రఘువంశీ తాను పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్‌ను బయటకు తీసుకొచ్చి విశాల్ దూబెకు సమాచారం ఇచ్చాడు. దూబె.. రాజీవ్ నయన్ మిశ్రా అలియాస్ రాహుల్, సుభాష్ ప్రకా్‌షకు విషయం చేరవేశాడు. అనంతరం రాజీవ్ నయన్ గ్యాంగ్ ఒక్కో పేపర్‌కు రూ.12 లక్షల ధర నిర్ణయించింది. కాగా, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 950 కి.మీ. దూరంలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఆర్వో పేపర్ ముద్రణ అవుతున్నట్లు తెలిసిన రాజీవ్.. విశాల్ దూబెతో కలిసి పథకం వేశాడు. సునీల్, విశాల్ గతంలో సహధ్యాయులు కూడా. మరోవైపు కన్సల్టెంట్‌గా పనిచేసే విశాల్, సుభా్‌షతో కలిసి విద్యార్థులను ఇంజనీరింగ్ కళాశాల్లో చేర్చేవాడు. దీంతో ఈ నలుగురూ కలిసి పథకం పన్నారు. ప్రశ్నపత్రం చేతికి దొరికాక సునీల్.. ఇతరులకు సమాచారం ఇచ్చాడు. వివేక్, బిహార్‌కు చెందిన అమర్జీత్‌లు ఆర్వో/అసిస్టెంట్ ఆర్వో పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను గుర్తించి వారి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. కాగా, రాజీవ్ నారాయణ్.. నీట్ పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారి రవి అత్రికి కూడా ఫోన్ ద్వారా చేరవేశాడు. అతడు ఇంకొందరికి వాటిని పంపడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Updated Date - Jun 25 , 2024 | 06:52 AM